కర్నూలు(హాస్పిటల్): వైద్య విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం మోత మోగిస్తోంది. క్రీడల అభివృద్ధి పేరుతో వారి నుంచి బలవంతపు వసూళ్లు చేస్తోంది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ ద్వారా ఆయా మెడికల్ కాలేజీలకు ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల మేరకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి వైద్య విద్యార్థులకు ఉత్తర్వులు వెళ్లాయి. ఈ మేరకు వైద్య విద్యార్థులు తప్పనిసరిగా క్రీడల కోసం తమ వంతు వాటా చెల్లిస్తున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో 250 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ మేరకు మొత్తం 1,250 మంది యూజీ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అలాగే వివిధ విభాగాల నుంచి మూడేళ్లకు కలిపి 538 మంది పోసు్ట్రగాడ్యుయేట్ (పీజీ) విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఈ కళాశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ బాగా రాణిస్తున్నారు. ఈ మేరకు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో ఆయా క్రీడాంశాల్లో పలు పతకాలు, ప్రశంసాపత్రాలు సాధిస్తున్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను మరింత ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం క్రీడల అభివృద్ధి పేరుతో వారి నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. ఆయా మెడికల్ కాలేజీలకు హెల్త్ యూనివర్సిటీ రూ.10 లక్షలు ఇస్తుందని, మరో రూ.10 లక్షలను విద్యార్థుల నుంచి వసూలు చేయాలని ఆయా కళాశాలలకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు కర్నూలు మెడికల్ కాలేజిలోనూ ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ పేరుతో వైద్య విద్యార్థులకు ఉత్తర్వులు వెళ్లాయి.
రూ.12 లక్షలకు పైగా వసూళ్లు
క్రీడా మైదానం అభివృద్ధి, క్రీడా పరికరాల కొనుగోళ్లకు గాను వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయాలని యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు పీజీ, యూజీ విద్యార్థులు డబ్బులు కళాశాల అకౌంట్‌లో జమ చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 1250 మంది యూజీ విద్యార్థుల నుంచి ఒక్కొక్కరు రూ.500ల చొప్పున రూ.6,25,000లు, 538 మంది పీజీ విద్యార్థుల నుంచి రూ.5,38,000లను వసూలు చేస్తున్నారు. ఈ మేరకు మొత్తం రూ.12,63,000ల ను విద్యార్థుల నుంచి వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధిక శాతం విద్యార్థుల నుంచి డబ్బులను కళాశాల బ్యాంక్ ఖాతాలో జమ చేయించారు. ఈ మొత్తాన్ని క్రికెట్ ఫీల్డ్స్, వాలీబాల్ కోర్టులు, బాల్‌బాడ్మింటన్ కోర్టులు, కబడ్డీ కోర్టులు, త్రోబాల్ కోర్టులు, ఫుట్‌బాల్ ఫీల్డ్స్, అథ్లెటిక్ ట్రాక్‌ల ఏర్పాటుకు వినియోగించనునున్నారు. క్రీడా మైదానాల అభివృద్ధి చేసి హెల్త్ యూనివర్సిటీ టోర్నమెంట్స్/నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా విద్యార్థుల నుంచి ఇప్పటికే ఫీజు రూపంలో వసూలు చేసిన మొత్తం కళాశాలలో రూ.8కోట్లకు పైగా నిధులు ఉన్నాయి. క్రీడా మైదానం అభివృద్ధికి, పరికరాల కొనుగోలుకు ఈ నిధులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. లేదా రాష్ట్ర ప్రభుత్వమే క్రీడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈ రెండు గాకుండా వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
క్రీడల నిర్వహణ పేరుతో వసూళ్లు
పీజీ విద్యార్థికి రూ.వెయ్యి,
యూజీ విద్యార్థికి రూ.500 చొప్పున
బలవంతపు వసూళ్లు
హెల్త్ యూనివర్సిటీ ఆదేశాల మేరకు
వసూలు చేస్తున్న అధికారులు


