ఆదోని: ఉదయాన్నే రోజు వారి కూలీ పనికి వెళ్లిన ఓ యువకుడు విద్యుదాఘాతానికి బలయ్యాడు. దిబ్బన్‌కల్ గ్రామానికి చెందిన గుజ్జుల రంగన్న నాలుగో కుమారుడు గోవిందు (23) గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిర్మిస్తున్న ఇంటికి క్యూరింగ్ చేయడానికి సోమవారం ఉదయం వెళ్లాడు. మోటార్ ఆన్ చేసి గోడలకు వాటర్ క్యూరింగ్ చేస్తుండగా మోటారు వద్ద పైపు ఊడిపోయింది. ఆ క్రమంలో పైపును తిరిగి అమర్చుతుండగా గోవిందు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబానికి అండ గా నిలవాల్సిన కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, అక్క కన్నీరుమున్నీరు గా విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గోవిందు మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
● కుడి ఎదపై గజ్జన్న పేరుతో పచ్చ బొట్టు
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం ఎస్సార్బీసీ కాల్వ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్సార్బీసీ కాల్వ నుంచి రాంగ్‌రూట్‌లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు లభించలేదు. మృతుడు 35 – 40 ఏళ్లు వయస్సులోపు ఉండొచ్చని, నలుపు, తెలుపు రంగు గళ్ల చొక్కా, తెల్లటి ప్యాంట్ ధరించారని ఎస్‌ఐ తెలిపారు. కుడి ఎదపై గజ్జన్న, కుడి చేయిపై సాయి సంతోష్, ఎడమ చేయిపై డి. నాగేంద్ర భూపతి పేర్లపై పచ్చ బొట్లు ఉన్నాయన్నారు. మృతదేహాన్ని నంద్యాల జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు 9121101096కు సంప్రదించాలని కోరారు.
ట్రాక్టర్ కింద పడి
డ్రైవర్ మృత్యువాత
బేతంచెర్ల: అంబాపురం గ్రామంలో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి చెందాడు. గ్రామానికి చెందిన బోయ కంసలి లింగన్న (42) ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం సేద్యం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా లోయ ప్రాంతంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడింది. సాయంత్రమైనా లింగన్న ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఆచూకీ తెలియలేదు. అయితే సోమవారం ఉదయం గ్రామానికి వచ్చే రహదారిలో లోయ ప్రాంతంలో ట్రాక్టర్ కింద పడి ఉన్న లింగన్నను గ్రామస్తులు గుర్తించి బయటకు తీశారు. కాగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతునికి భార్య లక్ష్మీదేవితో పాటు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు శెట్టి తెలిపారు.


