పెద్దాసుపత్రిలో యువతికి అరుదైన ఆపరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

పెద్దాసుపత్రిలో యువతికి అరుదైన ఆపరేషన్‌

Jun 9 2026 8:52 AM | Updated on Jun 9 2026 8:52 AM

ప్లీహం వద్ద ఏర్పడిన కణితి

ఆపరేషన్‌ ద్వారా తొలగింపు

కర్నూలు(హాస్పిటల్‌): ఆమెకు 50 లక్షల మందిలో ఒకరికి వచ్చే ఆరోగ్య సమస్య వచ్చింది. అనారోగ్య సమస్యతో ఆమె తిరగని ఆసుపత్రి లేదు. చివరకు పెద్దాసుపత్రిని నమ్ముకుని ఇక్కడికి వచ్చి చేరింది. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతి క్లిష్టమైన ఆపరేషన్‌ను వైద్యులు విజయవంతంగా చేశారు. సోమవారం ఈ వివరాలను ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లుతో కలిసి జనరల్‌ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్‌ హరిచరణ్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ జయరామ్‌ వివరించారు. డోన్‌ మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన శ్రావణి (18)కు ఏడాది క్రితం వివాహం అయ్యింది. కొంత కాలానికే ఆమెకు కడుపునొప్పి, కడుపు ఉబ్బరం సమస్య ప్రారంభమైంది. క్రమంగా నొప్పి తీవ్రం కావడంతో చికిత్స కోసం ఆమె ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించింది. కడుపులో నీటి బుడగలు ఉన్నాయని తేల్చి మందులు ఇచ్చి పంపినా తగ్గలేదు. దీంతో ఆమె చివరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జనరల్‌ సర్జరీ విభాగంలో గత నెల 9వ తేదీన చేరింది. ఆమెకు ప్రొఫెసర్‌ డాక్టర్‌ జయరామ్‌ అవసరమైన వైద్యపరీక్షలు చేయించారు. పొత్తి కడుపులో కుడివైపున ప్లీహము వద్ద అరుదైన కణితి ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వైద్యులు, అనెస్తీషియా వైద్యుల సహకారంతో ఆరు గంటల పాటు శ్రమించి జనరల్‌ సర్జరీ వైద్యులు ప్లీహము వద్ద ఏర్పడ్డ కణితిని పూర్తిగా తొలగించారు. ఆపరేషన్‌లో ప్రొఫెసర్‌ డాక్టర్‌ జె.జయరామ్‌తో పాటు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయశంకర్‌, స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్టులు డాక్టర్‌ బీసన్న, డాక్టర్‌ చైతన్యవాణి, డాక్టర్‌ ఎన్‌.దీప్తి, డాక్టర్‌ జగన్‌, అనెస్తీషియా వైద్యులు డాక్టర్‌ రామశివనాయక్‌, డాక్టర్‌ జయదేవ్‌ రాథోడ్‌, డాక్టర్‌ సురేఖ ఉన్నారు. శ్రావణి కోలుకోవడంతో 18వ రోజున ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఈ ఆపరేషన్‌ను డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ వైద్యసేవలో ఉచితంగా నిర్వహించినట్లు వారు తెలిపారు. ఇదే ఆపరేషన్‌ను ప్రైవేటులో నిర్వహిస్తే రూ.20 లక్షల వరకు వసూలు చేస్తారని చెప్పారు. ఆపరేషన్‌ను విజయవంతం చేసి, సమస్య పరిష్కరించి ప్రాణం పోసిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులను శ్రావణి కుటుంబసభ్యులు స్వగ్రామం నుంచి వచ్చి ఘనంగా సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement