కర్నూలు: నగరంలో కొత్తబస్టాండ్‌లో ప్రయాణికుల తరహాలో బస్సు ఎక్కుతూ చోరీకి పాల్పడిన హర్యానా రాష్ట్రానికి చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్నూలు విఠల్ నగర్‌కు చెందిన సావిత్రమ్మ, శ్రీలతలు హైదరాబాదుకు వెళ్లేందుకు గత నెల 14వ తేదీన కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉండగా అదే సమయంలో నలుగురు వ్యక్తులు వారికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ లగేజీ, బ్యాగులను బస్సులో పెడుతున్నట్లు నమ్మించారు. బ్యాగులో ఉన్న 6.5 తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి ఆభరణాలు అపహరించి బస్సు దిగి పరారయ్యారు. జడ్చర్ల వద్దకు చేరుకున్న తర్వాత బాధితులు లగేజీ బ్యాగును తెరిచి చూడగా అందులో ఉన్న ఆభరణాలు కనిపించలేదు. ఈ మేరకు బాధితురాలు సావిత్రమ్మ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీని పరిశీలించగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా గుర్తించి వారి వివరాలను సేకరించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన వారీగా గుర్తించి నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్‌ఐలు శరత్‌కుమార్, గోపితో కలసి సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి సీఐ విక్రమసింహ వివరాలు వెల్లడించారు. ఈ కేసులో సీసీ ఫుటేజీ ఆధారంగా నలుగురు దొంగలను గుర్తించి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. ప్రయాణ సమయంలో అపరిచిత వ్యక్తులను నమ్మి బ్యాగులను అప్పగించవద్దని, అప్రమత్తంగా ఉండాలంటూ సీఐ సూచించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరచిన క్రైం పార్టీ సిబ్బంది సుబ్బరాయుడు, మురళి, జీనస్, ఈశ్వర్, గోవింద్ తదితరులను సీఐ అభినందించారు.


