గెలవిల...
ఆళ్లగడ్డ/మహానంది/పాణ్యం: జిల్లాలో అరటి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బతిని అరకొరగా దిగుబడి చేతికొచ్చింది. ఈ సమయంలోనే మార్కెట్‌లో ధరలు నేల చూపు చూస్తున్నాయి. ధరలు లేక రైతులు గెలవిల కొట్టుకుంటున్నా ప్రభుత్వం కన్నెతి చూడటం లేదు. కోత, రవాణా ఖర్చులు రాని పరిస్థితి ఉంటంతో కొందరు తోటల్లోనే వదిలేశారు. మరికొందరు వేరే పైరు సాగుచేసుకునేందుకు తోటలను ట్రాక్టర్లతో దున్నేసి పశువులకు మేతగా వేస్తున్నారు. ఉద్యానశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 13 వేల ఎకరాల్లో అరటి సాగు అవుతోంది. బండిఆత్మకూరు, బేతంచెర్ల, చాగలమర్రి, డోన్, కొలిమిగుండ్ల, రుద్రవరం, మహానంది, పాణ్యం, ప్యాపిలి, శిరివెళ్ల మండలాల పరిధిలో అత్యధికంగా సాగు చేస్తుంటారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో టిష్యూకల్చర్, డ్రిప్ ఇరిగేషన్‌తో అరటి మొక్కలు పెంచుతున్నారు. ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల ఖర్చు వస్తోంది. దిగుబడి 25 నుంచి 30 టన్నుల మేర వస్తుందని గతంలో ఉన్న ధరలను దృష్టిలో పెట్టుకుని సాగు చేశారు. అయితే ఈ ఏడాది పెట్టుబడులు కూడా దక్కని కనిష్ట స్థాయికి ధరలు పడిపోవడంతో రైతుల ఆశలు నీరుగారాయి. జిల్లాలో రూ. కోట్లు నష్టపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తుండటంపై అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు.
అరటి సాగు చేసి అప్పుల పాలై..
గతేడాది అరటి టన్ను రూ. 28 వేలకు పైగా పలకగా.. ఈసారి టన్ను రూ. 500 పడిపోయిందంటే అరటి రైతు ఏమేరక నష్టపోయాడో అర్థమవుతోంది. రిటైల్ మార్కెట్‌లో ఇప్పటికీ డజను అరటి పళ్లు రూ. 50 నుంచి రూ. 70 కి తగ్గడం లేదు. వాటిని పండించే రైతుకు మాత్రం రూ. 5 దక్కడం లేదు. దీంతో అనేక మంది గెలలను ట్రాక్టర్లలో తరలించి రోడ్ల వెంట, బీడు భూముల్లో పారబోస్తుండటంతో పశువులకు ఆహారంగా మేపుకుంటున్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అరటి రైతులు నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతి ఏడాది సీజన్ మొదలయ్యే సరికి గ్రామాల్లోని దళారులు, వ్యాపారులు పొలం వద్దకు వచ్చి తమకే అరటి గెలలు విక్రయించాలని అడ్వాన్స్ ఇస్తూ అగ్రిమెంట్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు వ్యాపారుల వద్దకే రైతులు వెళ్లి ఎంతో కొంత ఎప్పుడో ఒక సారి డబ్బులివ్వండి.. గెలలు కొట్టుకోవాలని ప్రాథేయపడుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సుగంధాలదీ ఇదే పరిస్థితి..
రుచిలో మధురం, నాణ్యత కలగలసిన మహానంది సుగంధాల అరటి గెలలనూ అడిగేవారు లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వచ్చినప్పటి నుంచి ఈ పరిస్థితి నెలకొంది. గతంలో కిలో రూ. 18 నుంచి రూ. 20 ఉండగా ప్రస్తుతం కిలో కేవలం రూ. 6 నుంచి రూ. 7 వరకు ఉండటంతో పెట్టుబడులు మాట దేవుడెరుగు, కనీస కౌలు రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు చేసేదేమిలేక తోటల్లోనే గెలలను వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. గతంతో పోలి స్తే ధర మూడు రెట్లు తగ్గడంతో పెట్టిన పెట్టుబడులు, కౌలు రాకపోగా రైతులు నష్టపోయారు. మొన్నటి వరకు విజయవాడ, గుంటూరు, విను కొండ, తదితర పట్టణాలకు మహానంది అరటి ఎగుమతులు అధికంగా ఉండేవి. అయితే ప్రస్తు తం కొనేవారు, అడిగేవారు లేకపోవడంతో భువనేశ్వర్, ఒడిస్సా, బిహార్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దళారులేమో బాగుపడుతున్నారు కానీ అరటి రైతులు మాత్రం అప్పుల్లో కూరుకుపోయి నష్టపోతున్నారు.
అరటి ధర నేలచూపు
అడిగేవారు లేక పంటను
వదిలేస్తున్న రైతులు
ప్రస్తుతం టన్ను ధర రూ. 500 నుంచి
రూ.1,000 మాత్రమే
చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్
జిల్లాలో సాగు విస్తీర్ణం
12,813.54 హెక్టార్లు
ప్రస్తుతం కోతకు వచ్చింది 8 వేల హెక్టార్లు
ఇక్కడ అరటి చెట్లను గెలలతో సహా ట్రాక్టర్‌తో దున్నేస్తున్న రైతు చంద్ర ఓబులరెడ్డి. చాగలమర్రి మండలం చిన్నవంగళి గ్రామం. ఇతను రూ. 10 లక్షల వరకు ఖర్చు పెట్టి 8 ఎకరాల్లో అరటి సాగు చేశాడు. గెలలు కూడా బాగా వచ్చాయి. ఎడతెరిపి లేని వర్షం, ముసురు పట్టి తెగులు సోకి కాయలు సైజ్‌కాక ముందే మాగిపోతున్నాయి. మార్కెట్‌లో ధరలేక వ్యాపారులు ఎవరూ రావడం లేదు. చేసేదిలేక పది రోజుల క్రితం పంటను పూర్తిగా దున్నేశాడు.
గెలవిల...


