వేటగాళ్ల అక్రమ విద్యుత్ వినియోగంపై నిఘా పెట్టాలి
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం సమీపంలోని పొలాల్లో విద్యుత్ లైన్ల నుంచి వన్యప్రాణుల వేటగాళ్ల అక్రమ విద్యుత్ వినియోగంపై అధికారులు నిఘా పెంచి చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ సూచించారు. బైర్లూటీలోని ఎకో – టూరిజం సమావేశ మందిరంలో ఆదివారం ఆయన విద్యుత్ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెలుగోడు నార్త్ బీట్ ప్రాంతంలో ఇటీవల వేటగాళ్లు అక్రమ విద్యుత్ వినియోగించి వన్యప్రాణుల కోసం ఉచ్చులు వేశారన్నారు. ఆ ఉచ్చులకు ఒక ప్రొటెక్షన్ వాచర్ మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో బానకచర్ల గ్రామానికి విద్యుత్ సరఫరాకు వేసిన విద్యుత్ లైన్‌కు అటవీ అనుమతి లేదని వివరించారు. కొందరు రైతులు తమ పంటల రక్షణ పేరిట పొలాలకు అక్రమంగా విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తున్నారని, విద్యుత్ అధికారులు అడ్డుకోవాలన్నారు. అలాగే అటవీ ప్రాంతాల మీదుగా అను మతి లేకుండా వేసిన విద్యుత్ లైన్లు తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో నందికొట్కూరు, ఆత్మకూరు డివిజన్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు బబిత, ఎఫ్‌ఆర్‌వోలు పాల్గొన్నారు.


