బతికున్న రైతును రికార్డుల్లో చంపేశారు!
● ‘అన్నదాత సుఖీభవ’లో వింత
డోన్: కొత్తబురుజు గ్రామ రెవెన్యూ పరిధిలోని నక్కలవాగు పల్లె గ్రామానికి చెందిన రైతు తవిశెల రంగనాథరెడ్డి మృతి చెందినట్లు వ్యవసాయ అధికారులు తప్పుగా ధ్రువీకరించారు. దీంతో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అందిస్తున్న రూ. 5000 ఆర్థిక సహాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. విచిత్రం ఏందంటే కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా అందించే పీఎం కిసాన్ పథకం క్రింద మంజూరు అయిన రూ. 2000 తవిశెల రంగనాథరెడ్డి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యింది. అన్నదాత సుఖీభవ కింద మంజూరు కావలిసిన రూ.5000 బ్యాంక్ ఖాతాలో జమ కాక పోవడంతో వ్యవసాయ అధికారులను రైతు సంప్రదించాడు. వారు బెనివిషరీ స్టేటస్‌లో చూడగా తవిశెల రంగనాథరెడ్డి మృతి చెందినట్లు ఉండడంతో అవాక్కయ్యారు. ప్రభుత్వ సైట్ ఓపెన్ కాకవడంతో తాము చేయగలిగిందేమీలేదని వ్యవసాయ అధికారులు చేతులు ఎత్తేశారు. దీంతో ఆందోళన చెందిన రైతు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా ప్రభుత్వ సైట్ ప్రారంభం కాగానే దొర్లిన తప్పును సరిచేస్తామని వ్యవసాయ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
బతికున్న రైతును రికార్డుల్లో చంపేశారు!


