ఈ పురుగు కుడితే అంతే!
ఈ వ్యాధి పేరు పలకడానికి ఇబ్బంది ఉంటుంది. సోకితే మాత్రం మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణం మీదకూ తెస్తుంది. వివిధ రకాల విష జ్వరాల మాదిరిగా ఇది కూడా ఓ రకం జ్వరం. పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. లార్వల్ మైట్స్ అనే పురుగు కుట్టడం వల్ల వచ్చే ఈ వ్యాధినే వైద్య పరిభాషలో ‘స్క్రబ్‌టైఫస్’ అంటారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఈ వ్యాధి కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
లార్వల్ మైట్స్ పురుగు కుట్టడంతో ఏర్పడిన దద్దుర్లు
కర్నూలు(హాస్పిటల్): కొంత కాలంగా కోస్తా ప్రాంతానికే పరిమితమైన స్క్రబ్‌టైఫస్ వ్యాధి గత కొన్ని రోజులుగా జిల్లాలో వ్యాపిస్తోంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు ఉండే ప్రాంతాల్లో నివసించే వారిని ఈ వ్యాధి లక్ష్యంగా చేసుకుంటోంది. ఇప్పటికే జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జనరల్ మెడిసిన్ విభాగంలో 203 మంది చేరారు. వీరికి కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి విభాగంలో ఎలీసా విధానంలో వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించగా 38 మందికి వ్యాధి ఉన్నట్లు తేలింది. ఈ మేరకు అందరికీ అవసరమైన యాంటిబయాటిక్స్, మందులు ఇచ్చి వైద్యులు చికిత్స అందించారు. ఇప్పటివరకు అందరూ కోలుకోగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
స్క్రబ్‌టైఫస్ ఇలా వ్యాపిస్తుంది...
లార్వల్ మైట్స్ అనే పురుగు వల్ల స్క్రబ్‌టైఫస్ వ్యాధి వస్తుంది. ఈ పురుగు స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కన నివాసం ఉండేవారికి, ఆయా వ్యవసాయ పనుల్లో ఎక్కువసేపు ఉండేవారికి ఇది సోకుతుంది. చెట్లు, పొలాల్లో సంచరించే ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబారడం, దురదరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ఓరియోంటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఇది కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది.
వ్యాధి లక్షణాలు
అధిక జ్వరం, తీవ్రమైన చలి, కొంత మందికి దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం, ముదిరితే కామెర్లు, ఫిట్స్ లక్షణాలు కనిపిస్తాయి. న్యూమోనిటీస్, తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, ఎక్యూట్ రెస్పిరేటరి డిస్ట్రెస్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతారు. కొన్నిసార్లు కిడ్నీలు విఫలం కావడం, హృదయకండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం, తెల్లరక్తకణాలు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంత మందిలో కాలేయం, మూత్రపిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరుకోవచ్చు.
వీరు జాగ్రత్తగా ఉండాలి
మధుమేహం, బీపీ, హెచ్‌ఐవీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి స్క్రబ్‌టైఫస్ సోకితే ఇబ్బందులు మరింత పెరుగుతాయి. చిన్నపిల్లలు, వ్యాధినిరోధికశక్తి తక్కువగా ఉన్న వారికి సోకితే ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చాలా అరుదైన స్క్రబ్‌టైఫస్ వ్యాధి కేసులు ఇటీవల కాలంలో వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలతో ఇప్పటి వరకు 203 మంది రాగా వారికి మైక్రోబయాలజి ల్యాబ్‌లో వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించాము. అందులో 38 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరందరికీ జనరల్ మెడిసిన్ విభాగంలో ఉంచి వైద్యం అందించాము. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
–డాక్టర్ కె.వెంకటేశ్వర్లు,
సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు
జిల్లాలో పెరుగుతున్న
స్క్రబ్‌టైఫస్ కేసులు
పెద్దాసుపత్రిలో 203 మందికి
లక్షణాలు
38 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ
జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్యం
చెట్లు, పొలాల్లో పనిచేసే వారికి
ప్రమాదం
ఈ పురుగు కుడితే అంతే!
ఈ పురుగు కుడితే అంతే!


