బొలెరో వాహనం బోల్తా .. వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

బొలెరో వాహనం బోల్తా .. వ్యక్తి మృతి

Dec 2 2025 7:22 AM | Updated on Dec 2 2025 7:22 AM

బొలెర

బొలెరో వాహనం బోల్తా .. వ్యక్తి మృతి

బేతంచెర్ల: మండల పరిధిలోని రుద్రవరం గ్రామ సమీపాన ట్రాలీ బొలెరో వాహనం బోల్తాపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రుద్రవరం గ్రామానికి చెందిన బోయ శ్రీకాంత్‌ (29) యంబాయి గ్రామం నుంచి చామంతి పూల లోడుతో ఒక తోట నుంచి మరో తోటకు వెళ్తున్నాడు. రుద్రవరం గ్రామంలో కుక్క ఎదురు రావడంతో దానిని తప్పించబోయి బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ సంఘటనలో బోయ శ్రీకాంత్‌, మంటి సురేష్‌ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బోయ శ్రీకాంత్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌ బాబు తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలులో బీఎస్సీ నర్సింగ్‌ సీటు రాలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, తల్లిదండ్రులు చెప్పిన వివరాల మేరకు.. కర్నూలు నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో నివాసం ఉంటున్న మస్తాన్‌రావు కుమారుడు సాయి రోహన్‌ (20) ఇంటర్‌ పాసయ్యాడు. బీఎస్సీ నరింగ్స్‌ కోర్సులో చేసేందుకు ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాశాడు. అతనికి మొదటి ఫేజ్‌లో నంద్యాల శాంతిరామ్‌ కాలేజీలో సీటు వచ్చింది. అయితే కర్నూలులో సీటు కోసం రెండో ఫేజ్‌లో మళ్లీ కౌన్సెలింగ్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫలితాలు సోమవారం రావడం.. కర్నూలులో సీటు రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లోని బెడ్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడు. తండ్రి మస్తాన్‌రావు ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

కుక్కను తప్పించబోయి కారు బోల్తా..

ఎమ్మిగనూరు రూరల్‌: మండల పరిధిలోని సిరాలదొడ్డి గ్రామ క్రాస్‌ సమీపంలో కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా మహానంది మండలం అబిపురం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరు కారులో కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పలో జరిగే బంధువుల ఫంక్షన్‌కు వెళ్తున్నారు. సిరాలదొడ్డి క్రాస్‌ సమీపంలో రోడ్డు మధ్య గోతిపడటం, కుక్క అడ్డుగా రావటంతో తప్పించబోయి కారు బోల్తా పడింది. సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.తర్వాత వారు కారు రిపేర్‌ చేయించుకొని సిరుగుప్పకు వెళ్లిపోయారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడి కారు ధ్వంసం

గడివేముల: వైఎస్సార్‌సీపీ గడివేముల మండల కన్వీనర్‌ బొంతల మధుసూదన్‌ స్కార్పియో కారును రాళ్లతో ఆదివారం ఆర్ధరాత్రి గుర్తుతెలియని దుండగలు ధ్వంసం చేశారు. సోమవారం తన వాహనాన్ని మధుసూదన్‌ చూసి.. గతంలో కూడా తన కారుపై దాడికి ప్రయత్నించారన్నారు. రెండోవసారి ఇలా చేశారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీస్‌స్టేషన్‌లో అనుమానితులపై ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆర్‌బీ చంద్రశేఖరరెడ్డి, ఎంపీటీసీ వంగాల మహేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు దేశం నాగేశ్వరరెడ్డి, నంద్యాల వెంకటేశ్వర్లు వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుకున్నారు.

ఉచ్చులు వేస్తే జైలుకే

ఆత్మకూరురూరల్‌: నాగార్జున సాగర్‌ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం లోపల కానీ బయట పొలాల్లో కానీ వన్యప్రాణుల కోసం ఎవరైనా ఉచ్చులు వేస్తే జైలుకు పంపిస్తామని ప్రాజెక్ట్‌ టైగర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో కొందరు మోటార్‌ సైకిల్‌ క్లచ్‌ వైర్లతో తయారు చేసిన ఉచ్చులను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల పులుల అభయారణ్యం రక్షణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎవరైనా ఉచ్చులు వేస్తూ కనిపిస్తే 8 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు అధికారులకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.

బొలెరో వాహనం బోల్తా .. వ్యక్తి మృతి  1
1/2

బొలెరో వాహనం బోల్తా .. వ్యక్తి మృతి

బొలెరో వాహనం బోల్తా .. వ్యక్తి మృతి  2
2/2

బొలెరో వాహనం బోల్తా .. వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement