డబ్బు కోసమే రిటైర్డు ఉద్యోగి హత్య | - | Sakshi
Sakshi News home page

డబ్బు కోసమే రిటైర్డు ఉద్యోగి హత్య

Dec 2 2025 7:22 AM | Updated on Dec 2 2025 7:22 AM

డబ్బు కోసమే రిటైర్డు ఉద్యోగి హత్య

డబ్బు కోసమే రిటైర్డు ఉద్యోగి హత్య

నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

కొత్త వ్యక్తులను నమ్మొద్దు..

వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు

జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల: రిటైర్డు ఉద్యోగి మేదరి పుల్లయ్య (65) హత్యకేసును పోలీసులు ఛేదించారు. నమ్మకంగా మెలిగిన వ్యక్తే మరో ముగ్గురితో కలిసి డబ్బు కోసం దారుణంగా హత్య చేసి కుందూలో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. నంద్యాల పట్టణంలోని వీసీ కాలనీలో రిటైర్డు ఉద్యోగి మేదరి పుల్లయ్య భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈయనకు పట్టణంలోని దేవనగర్‌లో ఇల్లు ఉంది. ఈ ఇంటిని ఏడాదిన్నర క్రితం నంద్యాల వైఎస్సార్‌నగర్‌కు చెందిన బి.ధనుంజయ ఇతరులకు అమ్మించారు. ఈ క్రమంలో పుల్లయ్యతో ఏర్పడిన పరిచయాన్ని కొనసాగిస్తూ ఆయన వ్యక్తిగత విషయాలు, ఆస్తుల వివరాలు తెలుసుకున్నాడు. ఒంటరిగా ఉంటున్న అతడిని మట్టుబెట్టి ఆస్తులు కాజేయాలని ధనుంజయ భావించాడు. ప్లాన్‌ ప్రకారం గత నెల 14వ తేది గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన గంగాధర రాఘవ, గడివేముల మండలం బిలకలగూడూరు గ్రామానికి చెందిన బెస్త శ్రీకాంత్‌, గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన కె. సంతోష్‌తో కలిసి పుల్లయ్యను ఆటోనగర్‌కు పిలిపించుకొని బొలెరో వాహనంలో ఎక్కించుకొని గడివేముల మండలం భోగేశ్వరం దారి వైపు వెళ్లారు. అక్కడ వాహనాన్ని ఆపి రూ.25 లక్షలు డిమాండ్‌ చేయగా పుల్లయ్య ఇవ్వకపోవడంతో మెడకు తాడు బిగించి కత్తితో నుదిటి పైభాగంలో బలంగా గుద్ది హత్య చేశారు. అనంతరం శవాన్ని అనుమానం రాకుండా మద్దూరు గ్రామ సమీంలోని కుందూనదిలో వేశారు. మృతుడి సెల్‌ఫోన్‌, హెల్మెట్‌, కత్తి కూడా అందులోనే వేసి పుల్లయ్య ఇంటికి వెళ్లి డీవీఆర్‌ బాక్స్‌, డాక్యుమెంట్స్‌, ల్యాప్‌టాప్‌ తీసుకెళ్లారు. గతనెల 19వ తేదీన పుల్లయ్య కుమారుడు ఆదిత్య ప్రసాద్‌ తన తండ్రి కనిపించడం లేదని నంద్యాల త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే అదే నెల 29వ తేదీన గోస్పాడు మండలం తేళ్లపురి గ్రామం వద్ద పుల్లయ్య మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో ధనుంజయ, బెస్త శ్రీకాంత్‌,గంగాధర రాఘవ, కె. సంతోష్‌ హత్య చేసినట్లు తేలడంతో అరెస్టు చేసి వారి నుంచి కత్తి, రెండు డీవీఆర్‌లు, ల్యాప్‌టాప్‌, దస్తావేజు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా మెలగాలని, వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోరాదని ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు సూచించారు. సమావేశంలో ఏఎస్పీ మందాజావళి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement