జేసీబీలను విక్రయించే మోసగాళ్ల అరెస్టు
● రూ. 63.10లక్షల మోసం ● ఎనిమిది జేసీబీలు స్వాధీనం
పెద్దకడబూరు: ఒకరి జేసీబీలను మరొకరికి విక్రయించే ముగ్గురు మోసగాళ్లను అరెస్టు చేసినట్లు ఎమ్మిగనూరు డీఎస్పీ ఎన్.భార్గవి మర్రివాడ తెలిపారు. ఎనిమిది జేసీబీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పెద్దకడబూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో సోమవారం డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడబూరుకు చెందిన నీలయ్య, జింక నాగరాజు, తుగ్గలి మండలం, రాతన గ్రామానికి చెందిన భార్గవరాముడు ఫైనాన్స్ కింద హిందూపురం పట్టణానికి చెందిన నిర్మలబాయ్ నుంచి జేసీబీని తీసుకున్నారు. కంతులు చెల్లించకుండా, జేసీబీని తిరిగి ఇవ్వకుండా వేరేవారికి అమ్ముకున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు అందింది. కోసిగి సీఐ మంజునాథ్, ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్‌ఐలు ఆనంద్, శివరాములు, హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మన్న, కానిస్టేబుల్ మల్లికార్జున, హనుమంతు, బాస్కర్‌లు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. ఎల్లెల్సీ సమీపంలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఇలా కర్ణాటక రాష్ట్రంలో కూడా జేసీబీలు ఫైనాన్స్ కింద తీసుకొని కంతులు కట్టకపోవడమే కాక తక్కువ ధరలకు ఇతరులకు అమ్ముతూ రూ.63.10లక్షలు మోసం చేసినట్లు గుర్తించామన్నారు. మొత్తం ఎనిమిది జేసీబీలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటిని సంబంధిత యజమానులకు కోర్టు ద్వారా పంపిస్తామన్నారు. ఇంకా వేరే ఎవ్వరినైనా మోసం చేశారా అన్న కోణంలో విచారిస్తున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు.


