చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
● బిషప్ సంతోష్ ప్రసన్నరావు
నంద్యాల(న్యూటౌన్): ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని నంద్యాల డయాసిస్ అధ్యక్ష ఖండం పీఠాధిపతులు, ది రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు(బిషప్) అన్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ క్రీడా మైదానంలో సీడబ్ల్యూఎస్ విద్యార్థులకు వివిధ అంశాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. బిషప్‌తో పాటు డీఈఓ జనార్ధన్‌రెడ్డి అతిథులుగా హాజరై పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవ చేయడం దేవుడు ఇచ్చిన వరంగా భావించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రాల్లో నిర్వహించే వైద్య సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారి జగన్‌మోహన్‌రెడ్డి, ఎంఈఓలు శివరాంప్రసాద్, ప్రసన్నకుమార్, మాధవి, పీడీలు విశ్వనాథ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


