హాస్టల్ విద్యార్థి అదృశ్యం
కృష్ణగిరి: మండల పరిధిలోని కంబాలపాడు ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జండా అంజి (15) ఆదివారం అదృశ్యమైనట్లు వార్డెన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం తోటి పిల్లలతో భోజనం చేశాడని అనంతరం ఆడుకోవడానికి గ్రౌండ్‌కు వె వెళ్లడం జరిగిందన్నారు. సాయంత్రం స్నాక్స్ టైంలో హాజరు పరిశీలించగా ఈ విద్యార్థి కనపడలేదన్నారు. సమీపంలో అన్ని చోట్ల గాలించామని, ఈ విద్యార్థి స్వగ్రామైన డోన్ మండలం వెంకటనాయునిపల్లెలో తల్లిదండ్రులకు సమాచారం అందించామన్నారు. అక్కడకు కూడా రాలేదని తెలియడంతో సోమవారం పత్తికొండ ఏఎస్‌డబ్లూఓ బాబుతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. జరిగిన సంఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. ఈ అబ్బాయి ఆచూకీ తెలిసిన వారు కృష్ణగిరి ఎస్‌ఐ 9121101117, వెల్దుర్తి సీఐ 9121101114 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.


