రైతులను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం
● మొక్కజొన్నకు గిట్టుబాటు ధర
కల్పించాలి
● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
ఆధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
ఓర్వకల్లు: రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా ఆధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. బ్రాహ్మణపల్లె గ్రామంలో నష్టపోయిన మొక్కజొన్న రైతులను శనివారం ఆయన పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకులు ఒక్కసారి బ్రాహ్మణపల్లె గ్రామానికి వచ్చి చూడాలన్నారు. మద్దతు ధర లేక మొక్కజొన్న రైతులు ఏ విధంగా నష్టపోయారో తెలుసుకోవాలన్నారు. తమ ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులందరికీ గిట్టుబాటు ధర అందించామన్నారు. జొన్నలు అమ్ముడుపోకపోతే తానే ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు న్యాయం చేశానని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇంత వరకు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించలేదన్నారు. అన్నదాతలను టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పరిహారం ఎప్పుడు ఇస్తారు?
చంద్రాబాబు అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులకు కష్టాలు మొదలయ్యాయని కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఎరువులు, విత్తనాల కోసం పడిగాపులు చేయాల్సి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వంలో ఏ సీజన్‌లో పంటనష్టం జరిగితే ఆ సీజన్‌లోనే పరిహారం అందించామన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదన్నారు. కార్పొరేటర్ నారాయణరెడ్డి, స్థానిక నాయకులు నాగతిరుపాలు, వెంకటేశ్వర్లు, పుల్లారెడ్డి, రవి, బలరాం, దేవరాజు, మహేశ్వరరెడ్డి, రైతులు ప్రభుదాస్, రమణయ్య, బాలస్వామి పాల్గొన్నారు.


