తాగునీటి సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారు?
● డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య
ప్రకాశ్ రెడ్డిని నిలదీసిన మహిళలు
ప్యాపిలి: చెరువులను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్‌తో కలసి వచ్చిన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ‘ఎమ్మెల్యే గారూ.. మా కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారు?’ అని ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామ ప్రజలు నిలదీశారు. శనివారం జిల్లా కలెక్టర్ గణియా రాజకుమారితో కలసి డోన్ ఎమ్మెల్యే గుడిపాడు గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు ఒక్కసారిగా ఎమ్మెల్యేను చుట్టుముట్టి తాగునీటి సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారని నిలదీశారు. గత కొద్ది నెలలుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేగా మీరైనా మా సమస్యను పరిష్కరించాలని వారు పట్టుబట్టారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే కోట్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది. త్వరలోనే నీటి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పిన సమాధానంపై మహిళలు సంతృప్తి చెందలేదు. ఎమ్మెల్యేకు తాగునీటి సమస్య గురించి చెప్పుకోవడానికి వస్తే స్థానిక నాయకులు అడ్డుపడటంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎమ్మెల్యే మా గ్రామానికి వచ్చినప్పుడు కూడా సమస్యలు చెప్పుకునే వీలు లేకపోతే ఎలా?’ అని ప్రశ్నించారు. కాగా.. నీటి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.


