మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌తో కలిసి మత్తుపదార్థాల నియంత్రణపై శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలన్నారు. విద్యార్థి దశ నుంచే మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి నేరుగా సమాచారం సేకరించేందుకు ఐవీఆర్‌ఎస్, క్యూఆర్ కోడ్, వాట్సాప్ గవర్నర్స్ నంబరు (9552300009) వంటి పద్ధతులను అమలు చేస్తుందన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. విద్యాసంస్థల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రైల్వే స్టేషన్లు, రవాణా వాహనాలు, ప్రజా ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,781 కేసులు నమోదు చేసి, నిందితుల నుంచి రూ.4,95,830 వసూలు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్సీ/ఎస్టీ కోర్టు – కర్నూలు) వై.శ్రీహరి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్, డీఆర్‌ఓ రాము నాయక్, నంద్యాల, డోన్ ఆర్డీఓలు పాల్గొన్నారు.


