విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల భవిష్యత్తుతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు మండిపడుతునన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు మరో మూడు నెలల కాలం ఉందని, విద్యార్థులను సిద్ధం చేయాల్సిన ఉపాధ్యాయులతో క్రీడా పోటీలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల భవిష్యత్తు కంటే చంద్రబాబు సర్కారుకు ప్రచారం ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 1,199 ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ యాజమాన్యంలో 568 పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 1,33,325 మంది, ప్రైవేట్ పాఠశాలల్లో 1,60,445 మంది విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం 3,244 మంది టీచర్లు విధులు నిర్వహిస్తుండగా అందరికీ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
వింత పోకడ
చంద్రబాబు సర్కార్‌లో ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడలేదు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరిగి బాగుపడతారని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి నమ్మకాన్ని చంద్రబాబు సర్కారు నీరుగారుస్తోంది. ప్రచారం కోసం ఉపాధ్యాయులకు క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లలో 90 శాతం మందికి క్రీడలపై ఆసక్తి లేదని తెలుస్తోంది. ప్రశాంతంగా విద్యార్థులకు పాఠాలు చెప్పుకుంటున్నామని, ఈ సమయంలో క్రీడా పోటీలు ఏమిటని కొంత మంది బహిరంగంగా విమర్శిస్తున్నారు. మండల, జిల్లా స్థాయి క్రీడలకు లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేసి, వీటిని ఖర్చు చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్ర విద్యాశాఖ వింత పోకడలను అమలు చేస్తోందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్న సమయంలో క్రీడా పోటీల షెడ్యూల్ జారీ చేయడం విడ్డూరంగా ఉందని మండి పడుతున్నారు.
పరీక్షలకు సిద్ధమయ్యే వేళ
ఉపాధ్యాయులకు క్రీడలు
విస్మయం కలిగిస్తున్న
క్రీడా పోటీల షెడ్యూల్
రాష్ట్ర విద్యాశాఖ వింత నిర్ణయం


