అల్లుడి వేధింపులే కారణం
● అనంతరంపురం ఘటనలో అమూల్య తల్లిదండ్రుల ఆవేదన
వెల్దుర్తి: తమ కుమార్తె మరణానికి అల్లుడి వేధింపులే కారణమని అమూల్య తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతపురం నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ గురువారం ఇంట్లోనే మూడేళ్ల కుమారుడిని గొంతుకోసి, మహిళ ఉరేసుకున్న ఘటన తెలిసిందే. కలకలం రేపిన ఈ కేసులో ఆత్మహత్యకు పాల్పడిన అమూల్య(30) తండ్రి రామలక్ష్మయ్య నంద్యాల జిల్లా డీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి రమాదేవి కర్నూలు జిల్లా వెల్దుర్తి వాసి కాగా.. రిటైర్ట్ టీచర్ కేశన్న కుమార్తె. అమూల్య తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా కర్నూలులో నివాసముంటూ వెల్దుర్తిలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. దీంతో అమూల్య, ఆమె మూడున్నరేళ్ల కుమారుడు సహర్స్‌ల మృతదేహాలను అనంతపురంలో పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులు, బంధువులు శుక్రవారం రాత్రి వెల్దుర్తి పట్టణంలోని బోయ వీధికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అమూల్య తల్లిదండ్రులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఎం.అగ్రహారానికి చెందిన బండమీది రవితో ఐదేళ్ల క్రితం కర్నూలు పుల్లారెడ్డి కాలేజీలో బీటెక్ పూర్తి చేసుకున్న తమ కుమార్తె అమూల్యను ఇచ్చి వివాహం చేశామన్నారు. అల్లుడు సత్యసాయి జిల్లా రామగిరి మండలం డిప్యూటీ తహసీల్దార్ కాగా.. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నాడన్నారు. తమ కుమార్తె ఆత్మహత్య పట్ల అల్లుడు వరకట్నం తేవాలంటూ, ఇతరత్రా వేధింపులు తీవ్రస్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయం అనంతపురం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. తమ కుమారుడు, అమూల్య సోదరుడు ప్రశాంత్ యూఎస్ చికాగోలో ఉంటున్నాడని, విషయం తెలిసి బయలుదేరాడన్నారు. శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.
అల్లుడి వేధింపులే కారణం


