జిల్లాలో 5న మెగా పీటీఎం
నంద్యాల: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో డిసెంబర్ 5న మెగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీఎం)ను నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మెగా పీటీఎం ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ చాంబర్ నుంచి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 5వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కొనసాగుతుందన్నారు. విద్యార్థుల అభివృద్ధిపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడుతారన్నారు. సమావేశం అనంతరం హెచ్‌పీసీని విద్యార్థులకు అందజేస్తారన్నారు. పదో తరగతి సిలబస్ డిసెంబర్ 5 నాటికి పూర్తికాబోతోందని, అక్కడి నుంచి 100 రోజుల ప్రణాళికతో విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. మెగా పీటీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారన్నారు.


