రోడ్డు గుంతలమయం
జూపాడుబంగ్లా: తాము అధికారంలోకి వస్తే గుంతల్లేని రోడ్లను వేయిస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా గుంతలమయమైన రోడ్లవైపు కన్నెత్తి చూడకపోవటంతో ప్రయాణికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పారుమంచాల గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారటంతో ద్విచక్రవాహనాలదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తంగడంచ చెక్‌పోస్టు 340సీ రోడ్డు నుంచి పారుమంచాలకు 7కిలోమీటర్ల మేర బీటీరోడ్డు ఉంది. మూడేళ్ల క్రితం సుమారు రూ.1.50కోట్ల వ్యయంతో బీటీరోడ్డు ఆర్‌అండ్‌బీ అధికారులు వేయించారు. ఇప్పుడు రోడ్డు గుంతలమయంగా మారింది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ కనీసం గుంతలనైనా పూడ్పిస్తుందా అంటే అదీలేదు. దీంతో పారుమంచాల గ్రామానికి వెళ్లే ప్రయాణికులు గుంతలమయమైన రోడ్డులో ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని గుంతలను పూడ్పించి ప్రయాణం సవ్యంగా సాగేలా చేయాలని ప్రయాణికులు, వాహనాల డ్రైవర్లు కోరుతున్నారు.


