డిసెంబర్ 1 నుంచి పులుల గణన
మహానంది: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్) పరిధిలో డిసెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు పులుల గణన కార్యక్రమం ఉన్నట్లు ఎన్‌ఎస్‌టీఆర్ అధికారులు తెలిపారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వన్యప్రాణుల గణన జరగనున్నట్లు చెప్పారు. భారతదేశం అంతా ఒకేసారి జరిగే గణనలో ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఫేజ్–1 ప్రక్రియలో భాగంగా మూడు రోజుల పాటు మాంసాహార, మరో మూడు రోజుల పాటు శాఖాహార జంతువుల గణన ఉంటుందన్నారు. రెండు భాగాలుగా జరిగే ట్రెయిల్ పాత్, ట్రాంజాక్ట్ పద్దతుల్లో వన్యప్రాణుల గణన ఉంటుందన్నారు. ట్రయిల్ పాత్(మాంసాహార జంతువులు), ట్రాంజాక్ట్(శాఖాహార) పద్దతుల్లో వన్యప్రాణి జంతువులను లెక్కిస్తారన్నారు. ఎన్‌ఎస్‌టీఆర్ పరిధిలో జరిగే గణనకు సంబంధించి ఇప్పటికే అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులతో పాటు వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అఽథారిటీ వారి ఆధ్వర్యంలో ఈ వన్యప్రాణుల గణన ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎన్‌ఎస్‌టీఆర్ పరిధిలో 87 పెద్ద పులులు ఉన్నట్లు సమాచారం.


