ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చదవాలి
● జాతీయ రాజ్యాంగ దినోత్సవంలో సీనియర్ సివిల్ జడ్జి బి.లీలా వెంకట శేషాద్రి
కర్నూలు సిటీ: దేశానికి దిక్సూచి అయిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రాజనీతి విభాగం ఆధ్వర్యంలో ప్రజాపరిరక్షణ ఐక్యవేదిక, కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్–2 యూనిట్లు సంయుక్తంగా బుధవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి తెలుసుకొని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది వై.జయరాజు మాట్లాడుతూ రాజ్యాంగ చారిత్రక నేపథ్యాన్ని, రాజ్యాంగ రూపకల్పనలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. ఆ తరువాత ఈగల్ టీం ఎస్‌ఐ సృజన్‌కుమార్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ త్రినాథ్ కుమార్ మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహూమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపల్స్ హేమంత్, సత్యనారాయణ, లయన్స్ క్లబ్ సభ్యులు డా.రాయపాటి శ్రీనివాస్, ప్రజాస్వామ్య పరిరక్షణ జిల్లా కార్యదర్శి అడ్వకేట్ రవికుమార్, మాజీ సైనికాధికారి కె.డి.జె. బాలు, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డా.ఆర్ రోషన్న, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.


