జూనియర్ వెటర్నరీ ఆఫీసర్‌కు జాతీయస్థాయి పురస్కారం
కర్నూలు(అగ్రికల్చర్): లింగనిర్ధారిత వీర్యం ద్వారా కృత్రిమ గర్భధారణ సూదులు వేయడం ద్వారా పెయ్య దూడలను అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషి చేసిన జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ అనురాధకు జాతీయ స్థాయిలో గోపాలరత్న అవార్డు లభించింది. 2023లో లింగనిర్ధారిత వీర్యంతో పెయ్య దూడలు పుట్టి పాడిని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది. కర్నూలులోని పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోంది. మహానంది మండలం గోపవరం గ్రామీణ పశువైద్యశాల జూనియర్ వెటర్నరీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అనురాధ 2023, 2024, 2025లో లింగనిర్ధారిత వీర్యంతో 800 ఆవులు, గేదెలకు కృత్రిమ గర్భధారణ సూదులు వేశారు. దీని వల్ల చూలు కట్టి పుట్టిన దూడల్లో 95 శాతం అంటే 340 పెయ్యదూడలే ఉన్నాయి. అలాగే పాల ఉత్పత్తి పెరిగింది. పాల ఉత్పత్తిలో అద్భుతంగా రాణిస్తున్న రైతులు, డెయిరీ ఫాంలు నిర్వహించే వారికి, కృత్రిమ గర్భధారణ ద్వారా పెయ్యదూడలు అభివృద్ధి చేసే పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బందికి జాతీయ స్థాయిలో గోపాలరత్న అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుకు దేశం మొత్తం మీద 2000 మంది దరఖాస్తు చేసుకోగా 20 మంది ఎంపికయ్యారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాత జాతీయ స్థాయిలో చివరకు ముగ్గురు మాత్రమే అవార్డులకు అర్హులుగా నిలిచారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అనురాధ ఒకరు. బుధవారం జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వశాఖ మంత్రి ఆమెకు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరించారు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన జేవీఓను ఉమ్మడి జిల్లా పశుసంరవ్ధక శాఖ అధికారులు అభినందించారు.


