శివ..శివా.. చూచితివా!
శ్రీగిరిలో దాతల సహకారంతో కాటేజీల నిర్మాణాలు
కాటేజీలు, హోటళ్లకు వ్యక్తుల పేర్లు
క్షేత్రంలో కొరవడుతున్న ఆధ్యాత్మిక చింతన
ఇటీవల తిరుమలలో వ్యక్తుల పేర్లు తొలగించిన వైనం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు వసతి సౌకర్యార్థం దాతల సహకారంతో కాటేజీల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఆధ్యాత్మిక క్షేత్రంలో వాటికి దేవుని పేర్లు ఉండాల్సిన చోట వ్యక్తులు, సంస్థల పేర్లు ఉండడంతో ఆధ్యాత్మిక వాతావరణం సన్నగిల్లుతుందనే విమర్శలు ఉన్నాయి. క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం కుటీర నిర్మాణ పథకం ద్వారా దాతల సహకారంతో కాటేజీలను నిర్మిస్తోంది. ఇందుకోసం దాతలు దేవస్థానంలో కాటేజీ నిర్మించలతలపెడితే ముందుగా దేవస్థానానికి దరఖాస్తు చేసుకుంటారు. సుమారు రూ.15 లక్షల నగదు, లేదా డీడీని అందించాలి. దేవస్థానం 10 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తోంది. ఆ స్థలంలో దాతకు ఇష్టం వచ్చినట్లు కాటేజీ నిర్మాణం చేపడతారు. నిర్మాణం పూర్తయిన తరువాత దాత కాటేజీని దేవస్థానానికి అప్పగించాలి. ఏడాదిలో దాతకు 45 రోజులు ఉచితంగా వసతి కల్పిస్తారు. దాత సిఫార్సు లేఖతో ఎవరైనా వస్తే సగం ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇలా శ్రీశైల దేవస్థానంలో దాతల సహకారంతో సుమారు 35 వరకు కాటేజీలు ఉన్నాయి. ఇంకా నిర్మాణంలో పలు కాటేజీలు ఉన్నా యి. అయితే ఇప్పటి వరకు నిర్మించిన కాటేజీలకు దాతకు సంబంధించిన పేరు లేక వారి బంధువులకు సంబంధించిన పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు ఏరాసు కాటేజీ, గొట్టిపాటి కాటేజీ, జేసీ దివాకర్‌రెడ్డి కాటేజీ, విజయ, ఇంద్ర నిలయం, అపరాజిత, దేవినేని, ఏ.ఎం.ఆర్, శాంతి, సాహితి, చంద్రశేఖర, రుద్ర, బట్టా సదన్ ఇలా పలు వ్యక్తుల పేర్లతో కాటేజీలు దర్శనమిస్తు న్నాయి. అలాగే క్షేత్రంలో టెండర్ దక్కించుకుని నిర్వహించే ప్రైవేట్ హోటళ్లకు సైతం అపూర్వ, ఐలాపురం, నాయుడు, సహస్ర తదితర పేర్లతో పలు హోటళ్లు సైతం దర్శనమిస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో దేవుళ్ల పేర్లు ఉండకుండా వ్యక్తులు పేర్లు ఉండడంపై కొందరు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో తొలగింపు..
తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కాటేజీలకు వ్యక్తుల పేర్లు ఉండగా ఇటీవల తొలగించి దేవుళ్ల పేర్లు ఏర్పాటు చేశారు. టీటీడీని ఆదర్శంగా తీసుకుని శ్రీశైల మహాక్షేత్రంలో కూడా మార్పులు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీగిరిలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంచేందుకు ఈ అంశం దోహదపడనుందని సూచిస్తున్నారు.
శివ..శివా.. చూచితివా!
శివ..శివా.. చూచితివా!
శివ..శివా.. చూచితివా!


