బనగానపల్లె రెవెన్యూ డివిజన్‌కు పచ్చజెండా
బనగానపల్లె/కోవెలకుంట్ల: రాష్ట్రంలో మరో మూడు కొత్త జిల్లాలతో పాటు ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్తగా ఏర్పాటు కానున్న రెవెన్యూ డివిజన్లలో బనగానపల్లెకు చోటు దక్కింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసింది. ఇందులో నంద్యాల కొత్త జిల్లాగా అవతరించింది. కొత్త జిల్లాలో నంద్యాల, ఆత్మకూరు, డోన్ రెవెన్యూ డివిజన్లుగా కొనసాగుతున్నాయి. బనగానపల్లె నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండ గా ఇప్పటి వరకు సంజామల, కొలిమిగుండ్ల మండలా లు నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో మిగిలిన కోవెలకుంట్ల, అవుకు, బనగానపల్లె మండలాలు డోన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుత ప్రభు త్వం బనగానపల్లెను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయనుంది. కొత్త రెవెన్యూ డివిజన్‌లో బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల మండలాలతోపాటు మరికొన్ని మండలాలు చేరుస్తారని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేస్తే రెవెన్యూ డివిజన్ పరిధిలోని వచ్చే మండలాల వివరాలు అధికారికంగా వెల్లడి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నియోజకవర్గానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సరిహద్దులో సంజామల మండలంలోని నొస్సం, అనంతపురం జిల్లా తాడిపత్రి సరిహద్దులో కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామాలు హద్దులుగా ఉన్నాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 3,12,416 మంది జనా భా ఉండగా ఆయా మండలాల పరిధిలో 2,41,179 మంది ఓటర్లు ఉన్నారు.


