సమగ్ర చర్యలతో రోడ్డు ప్రమాదాల నివారణ
● జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్
నంద్యాల: రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రహదారి భద్రతపై జేసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. శాంతిరాం ఆసుపత్రి సమీపంలో రహదారిపై రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి, అవసరమైన లైటింగ్ పెంచాలని ఆదేశించారు. ఎన్‌హెచ్–44 మార్గంలో డోన్ మండలం, దొరపల్లి గ్రామం వద్ద మెరుగైన విద్యుత్ సదుపాయాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. బ్రాహ్మణకొట్కూరు ప్రాంతంలో ఎన్‌హెచ్–340సి రహదారి నిర్మాణంలో సాగు భూములకు వెళ్లడంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమస్యపై బాధి తులు అర్జీలు ఇస్తున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. రహదారులపైకి పాడిపశువులు అడ్డుకునేందుకు పోలీసు శాఖ సహకారంతో చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ.. భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న సర్వీస్ రోడ్లను పునరుద్ధరించాలన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్ రెడ్డి, డీఎస్పీ ప్రమోద్‌కుమార్, జిల్లా రవాణా శాఖ అధికా రి శివారెడ్డి, ఎన్‌హెచ్ అధికారులు పాల్గొన్నారు.


