పీజీఆర్‌ఎస్‌కు 82 ఫిర్యాదులు
నంద్యాల: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయి. చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఎస్పీ సునీల్‌షెరాన్ ఆదేశించారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
30 లోగా ‘పది’ పరీక్ష ఫీజు చెల్లించాలి
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పరీక్ష ఫీజు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 30లోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్‌రెడ్డి సోమవారం ఒక ప్రటకనలో తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో విద్యార్థులు నామినల్ రోల్, సంబంధిత పాఠశాలలో యూడైస్ పరిశీలించాలని సూచించారు. వివరాలకు 9885979920, 9948063324 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
25 నుంచి ఆర్‌యూ బీఈడీ సెమిస్టర్ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బీఎడ్ 3వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 19 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. బీఈడీ రెగ్యులర్ 3,474, సప్లిమెంటరీ 471 మంది, బీపీఈడీ రెగ్యులర్ 145, సప్టిమెంటరీ 21 మంది, ఎంపీఈడీ రెగ్యులర్ 86, సప్టిమెంటరీ 27 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. విద్యార్థులు నిర్దేశించిన పరీక్ష సమయానికి 30 నిమిషాలు ముందుగానే చేరుకోవాలని విజ్ఙప్తి చేశారు.
మంత్రాలయం రూరల్: రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయల్లో భక్తుల భద్రతే తమ లక్ష్యమని ఆక్టోపస్ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. ఉగ్రవాదులు చొరబడితే వారి నుంచి భక్తులను, ప్రజలను కాపాడుతామన్నారు. శ్రీమఠం ప్రాంగణంలో ఆక్టోపస్ కమాండోలు సోమవారం మాక్‌డ్రిల్ చేశారు. అనంతరం శ్రీమఠం మేనేజర్ ఎస్‌కే శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మధుసూదన్ మట్లాడుతూ.. అత్యవసర ప్రమాదాలు ఏర్పడితే ఆక్టోపస్ బలగాలు సిద్ధంగా ఉంటాయన్నారు. ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు జరగకుండా ఏం చేయాలో వీడియో ద్వారా అధికారులకు చూపించారు. తహసీల్దార్ రమాదేవి, సీఐ రామాంజులు, కమాండో ఇన్‌స్పెక్టర్లు ఎంఆర్‌సీ నాయక్, వరప్రసాద్, రాంమోహన్ , శ్రీమఠం అధికారులు మాదవశెట్టి, వెంకటేష్ జోషి, సురేష్ కోనాపూర్, అనంతపురాణిక్ తదితరులు పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతులకు జిల్లాస్థాయి ఆటల పోటీలు
కర్నూలు(అర్బన్): అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతులకు, బధిరులకు, అంధులకు, మానసిక దివ్యాంగులకు ఉమ్మడి జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27న ఉదయం 8 గంటలకు కర్నూలు ఔట్‌డోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించవచ్చన్నారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, వికలత్వ ధృవీకరణ పత్రం(సదరం) తీసుకురావాలన్నారు. వివరాలకు 08518–277864 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 82 ఫిర్యాదులు


