గౌరవం లేదు.. వేతనం రాదు!
నందికొట్కూరు: ప్రజల ఓట్లతో గెలిచిన మండల ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులను చంద్రబాబు ప్రభుత్వం గుర్తించడం లేదు. గౌరవ వేతనాలు ఇవ్వడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై వారికి సమాచారం ఇవ్వకుండా టీ డీపీ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 815 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. మరో రెండు, మూడు నెల్లో వారి కాలపరిమితి పూర్తి అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నెలకు రూ. 3 వేలు గౌరవ వేతనం అందడం లేదు. ఉమ్మడి జిల్లాలో రూ, 41,56,5000 వేతనం రావాల్సి ఉంది.
ఇదీ దుస్థితి..
● ఎంపీటీసీ సభ్యులకు నిధుల కేటాయింపులో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి మందగించింది.
● గతంలో బీఆర్‌జీఎఫ్, ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం జిల్లా పరిషత్‌కు కేటాయించేవారు. వీటితోనే గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎంపీటీసీ సభ్యులు చేసేవారు. ప్రస్తుతం ఇప్పుడా పరిస్థితి లేదు.
● చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రెండుసార్లు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఎంపీటీసీల గౌరవవేతనాల బిల్లులు పెడుతున్నామని అధికారులు చెబుతున్నారే తప్ప, వారి ఖాతాల్లో నగదు జమ కాలేదు.
● చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మండల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.
ఎంపీటీసీ సభ్యులను చంద్రబాబు ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ప్రతి నెలా గౌరవం వేతనం ఇవ్వడం లేదు. కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదు.
– బాలరాజు, నందికుంట ఎంపీటీసీ
చంద్రబాబు ప్రభుత్వం ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. ఇప్పటి వరకు ఒక పైసా నిధులు ఇవ్వలేదు. వేతనాలు రావడం లేదు. పేరుకే ఎంపీటీసీలుగా ఉన్నాం. – వై. నాగేశ్వరరెడ్డి, చింతపల్లి ఎంపీటీసీ
గత ప్రభుత్వంలో ఎంపీటీసీలకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇంత వరకు రాలేదు. ప్రతి నెలా ఎంపీటీసీల వేతనాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం.
– దశరథరామయ్య, మిడుతూరు ఎంపీడీఓ
ఎంపీటీసీల సభ్యులకు గుర్తింపు కరువు
ప్రభుత్వ కార్యక్రమాల్లో
టీడీపీ నేతలకే ప్రాధాన్యత
చంద్రబాబు ప్రభుత్వంలో
అందని గౌరవ వేతనాలు
గౌరవం లేదు.. వేతనం రాదు!
గౌరవం లేదు.. వేతనం రాదు!


