మహానందిలో వసతిగృహాల నిర్మాణానికి రూ.1.25కోట్లు
● ఒప్పంద పత్రం ఇచ్చిన
ప్రవాస భారతీయురాలు
మహానంది: మహానంది దేవస్థానం అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానంది క్షేత్రంలో నూతనంగా నిర్మించనున్న వసతి గహాల నిర్మాణానికి హైదరాబాద్‌లో ఉంటున్న ప్రవాస భారతీయురాలు వడ్లమూడి సరోజిని రూ.1.25 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని వారి స్వగహంలో కలిసి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. సరోజిని భర్త కీర్తిశేషులు వడ్లమూడి రమేష్ బాబు పేరుతో విరాళం అందించేందుకు ఒప్పంద పత్రాన్ని ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని, ఆలయ ఏఈఓ ఎరమల మధు, జగదీశ్వర రెడ్డి, వేద పండితులు హనుమంత శర్మ, అర్చకులు రఘు శర్మ పాల్గొన్నారు.
తెలుగు వర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ( చరిత్ర, పురావస్తు శాస్త్రం) ప్రథమ సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పీఠాధిపతి ముసుగు శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి చరిత్ర పురావస్తు శాఖలో ఐదు సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 29లోగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు జతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరై ప్రవేశం పొందవచ్చునని తెలిపారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్ 9441370591 ద్వారా తెలుసుకోవాలన్నారు.


