అర్జీలను గడువులోపు పరిష్కరించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారిఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగవంతంగా పరిష్కరించాలన్నారు. రీఓపెన్ అయిన 479 అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్‌మెంట్‌లు స్పష్టంగా, నాణ్యంగా ఉండాలన్నారు. పీజీఆర్‌ఎస్ 220 వినతులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీల్లో కొన్ని.
● తనకు ప్రస్తుతం రూ.6వేలు పెన్షన్ వస్తోందని, తాను దివ్యాంగుడనని, మంచానికే పరిమితమై ఉన్నానని, రూ.15వేల పింఛన్ ఇవ్వాలని బేతంచెర్ల మండలానికి చెందిన రమేష్ వినతి పత్రం అందజేశారు.
● తన పొలం ఆక్రమణకు గురైందని, సర్వే చేసి న్యాయం చేయాలని ప్యాపిలి మండలం కలచర్ల గ్రామానికి చెందిన చిరంజీవి అర్జీ ఇచ్చారు.
● తనకున్న ఐదు ఎకరాల భూమిని ఆన్‌న్‌లైన్‌న్‌లో నమోదు చేయాలని పాములపాడు మండలం గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి కోరారు.


