కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించండి
● ‘రైతన్నా..మీకోసం’లో
ఏఓను నిలదీసిన రైతులు
జూపాడుబంగ్లా: మీరేమి చెప్పినా ప్రయోజనం లేదు సార్.. తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి గిట్టుబాటు ధర లభించేలా చూడాలని రైతులు ఏఓ కృష్ణారెడ్డిని నిలదీశారు. చంద్రబాబు సర్కార్ సోమవారం నుంచి ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఏఓ కృష్ణారెడ్డి మండలంలోని తర్తూరు, మండ్లెం, తంగడంచ, తాటిపాడు, 80బన్నూరు గ్రామాల్లో ఆయా గ్రామసచివాలయాల సిబ్బందితో రైతులను కలిశారు. ఈ సందర్భంగా రైతులు కల్పించుకొని చంద్రబాబు సర్కార్ వచ్చాక రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఖరీఫ్ పంటలు వేసినప్పటి నుంచి అధికవర్షాలు కురిసి పంటలు నష్టపోయినా పైసా నష్టపరిహారం మంజూరుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆమేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాల్లేవన్నారు. వ్యాపారులు కుమ్మకై ్క క్వింటాకు కేవలం రూ.1,700 చొప్పున కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. అధికవర్షాలతో దిగుబడులు తగ్గగా గిట్టుబాటు ధరలేక పంటల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు అధికారులను నిలదీశారు. రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని అధికారులు పాంప్లెట్‌లు పంపిణీ చేసి వెనుతిరగడం గమనార్హం. అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన కరువైంది.


