ఆలయ అభివృద్ధికి రూ.3.50 లక్షల విరాళం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి బెంగళూరు నగరానికి చెందిన కేఎస్ రమేష్ కుటుంబ సభ్యులు రూ.3,50,000 అందజేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పీవీ కుమార్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నల్లమల మీదుగా రాకపోకల పునరుద్ధరణ
ఆత్మకూరురూరల్: భారీ వర్షాల కారణంగా నల్లమల ఘాట్ రోడ్‌లో మూడు రోజులుగా నిలిచిన వాహనాల రాకపోకలను శుక్రవారం ఉదయం నుంచి పునరుద్ధరించారు. జాతీయ రహదారి 40సీ (కర్నూలు– గుంటూరు) పక్కనే ఉన్న సిద్ధాపురం చెరువు అలుగు ఉధృతంగా ప్రవహించడంతో ఘాట్ రోడ్డులో మంగళవారం రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిపి నంద్యాల మీదుగా మళ్లించారు. శుక్రవారం ఉదయం అలుగుపై నీటి ఉధృతి బాగా తగ్గిపోవడంలో ఆత్మకూరు సీఐ రాము అలుగును పరిశీలించి ఈ మార్గంలో అన్ని వాహనాలను అనుమతించారు.
శాంతించిన కుందూ
ఉయ్యాలవాడ: భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన కుందూనది శాంతించింది. ఉయ్యాలవాడ, రూపనగుడి గ్రామాల మధ్య కుందూ వంతెనపై వరద నీరు ప్రవహించడంతో గురువారం రాకపోకలు అధికారులు నిలిపి వేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నీటి ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. నదీ తీరం వెంట జలదిగ్బంధంలో వున్న 14 గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాకపోకలు ప్రారంభమయ్యాయి. నర్సిపల్లె, కాకరవాడ, హరివరం, ఆర్.జంబులదిన్నె, రూపనగుడి, ఉయ్యాలవాడ, అల్లూరు, మాయలూరు గ్రామాలలో కుందూనది తీరం వెంట లోతట్టు ప్రాంతాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు పూర్తిగా నీట మునిగి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కుందూనదిలో 30 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది.
3 నుంచి పత్తి కొనుగోళ్లు
నంద్యాల(అర్బన్): నవంబర్ 3వ తేదీ నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంపిక శ్రేణి కార్యదర్శి కల్పన తెలిపారు. స్థానిక విజయ మిల్క్ డెయిరీ వెనుక వైపు ఉన్న మురారీ పవన్ ఆగ్రో టెక్‌లో క్వింటా రూ.8,110 కనీస మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం మార్కెట్‌యార్డు చైర్మన్ హరిబాబుతో కలిసి ఆమె ప్రారంభించారు. అందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తేమ శాతం 12శాతం మించి ఉన్న పత్తిని సీసీఐ వారు కొనుగోలు చేయరన్నారు. పత్తిని బాగా ఆరబెట్టి శుభ్ర పరిచి కేంద్రానికి తీసుకు రావాలన్నారు. గుడ్డి పత్తి, రంగు మారిన పత్తి, పురుగు పట్టిన పత్తి కొనుగోలు చేయరని, నీళ్లు చల్లి వర్షంతో తడిసిన పత్తిని సైతం కొనుగోళ్లకు ఆస్కారం లేదన్నారు. కార్యక్రమంలో అధికారులు రెమహమాన్, శేషిరెడ్డి, స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి రూ.3.50 లక్షల విరాళం
ఆలయ అభివృద్ధికి రూ.3.50 లక్షల విరాళం
ఆలయ అభివృద్ధికి రూ.3.50 లక్షల విరాళం


