
‘సొమ్మొకడిది.. సోకొకడిది, ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చి
పీ4 ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వకుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విధానంతో పేదలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని, 2029కి వందశాతం పేదరిక నిర్మూలన చేస్తామని, అప్పటికీ పేదరికం ఉంటే, అప్పుడు ఆడబిడ్డనిధి పథకాన్ని పీ4కు అనుసంధానం చేస్తామని మే 17న కర్నూలు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రకటించారు.
... అంటే 2029 వరకు ఆడబిడ్డనిధి అమలు చేయలేమని ముఖ్యమంత్రి
తేల్చి చెప్పినట్లయింది.
అధికారులకు తలనొప్పిగా పీ4
● ఇప్పటికే ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి
● మార్గదర్శులను(దాతలు) వెతికి
స్పాన్సర్ చేయించాలని లక్ష్యాలు
● జిల్లా నుంచి మండలస్థాయి
అధికారులందరికీ తప్పని తిప్పలు
● దాతలను వెతికే బాధ్యతపై
తీవ్ర వ్యతిరేకత
● తప్పించాలని కలెక్టర్లకు
మూకుమ్మడిగా చెప్పే ప్రయత్నం
సూపర్‌సిక్స్‌లో అరకొరగా తల్లికి వందనం, పాక్షికంగా ఉచిత గ్యాస్ అమలు మినహా తక్కిన నాలుగు పథకాలు అమలు చేయలేని ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ చర్చను పక్కదారి పట్టించేందుకు ‘పీ4(పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్) అనే ఓ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాల భాగస్వామ్యంతో సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించి, వారి ఆర్థికస్థితి మెరుగుపరుస్తామనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. తద్వారా ఖజనాకు భారీ ఆదాయం సమకూరుతోంది. రూ.3లక్షల కోట్లకుపైగా వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఆ డబ్బుతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అయితే మార్గదర్శుల పేరుతో దాతలను వెతికి వారితో ఖర్చు పెట్టించి ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని ప్రభుత్వం చెబుతుండటం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అధికారుపై కలెక్టర్ల తీవ్ర ఒత్తిడి
రాష్ట్రవ్యాప్తంగా పీ4 కింద మార్గదర్శులుగా ప్రభుత్వం కొందరిని ఒప్పించింది. వీరికి ఈ నెల 18న ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాలో పెట్టుబడులు పెట్టిన ‘గ్రీన్‌కో’ అధినేత చలమలశెట్టి అనిల్, జయరాజ్ ఇస్పాత్ నుంచి సజ్జన్‌కుమార్ గోయంకా, రామ్‌కో సిమెంట్ నుంచి వెంకటరమణరావులు కూడా ఉన్నారు. ఇలా ఆర్థికంగా బలంగా ఉన్నవారితో పాటు ప్రతీ జిల్లా అధికారి నుంచి మండలస్థాయి అధికారి వరకూ అందరూ ‘మార్గదర్శులు’ను వెతికాలని కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు రంజిత్‌బాషా, రాజకుమారి సమీక్షలు నిర్వహించి ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిణామం అధికారులను విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతపై ఒత్తిడి చేస్తే పని చేస్తాం కానీ, దాతలను వెతకాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని పెదవి విరుస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటంతో అధికారులు ఎవరి స్థాయిలో వారు దాతలను వెతికే పనిలో ఉన్నారు.
ఆడబిడ్డ నిధికి మంగళం
2029 వరకూ ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదని కర్నూలు పర్యటనలో ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారు. 2029 మొదటి త్రైమాసికం వరకే ప్రభుత్వానికి ప్రజలు గడువిచ్చారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి. పీ4 ముసుగులో ఆడబిడ్డ నిధిని ప్రభుత్వం అటెక్కించింది. ఆడబిడ్డ నిధి కింద కర్నూలు జిల్లాలో 6,98,404 మంది, నంద్యాల జిల్లాలో 9,08,616 మంది అర్హులు ఉన్నారు. వీరికి గతేడాది రూ.2,892.62కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. ఈ ఆర్థిక సంవత్సరం మరో రూ.2,892.62కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. పీ4కు పథకాన్ని అనుసంధానం చేశామని ప్రభుత్వం చెప్పడం, దాని అమలుకు అధికారులను ఒత్తిడికి గురి చేయడం చూస్తే పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

‘సొమ్మొకడిది.. సోకొకడిది, ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చి