
మహానందీశ్వరుడికి రూ. 48.61 లక్షల ఆదాయం
మహానంది: మహానంది క్షేత్రానికి హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 48,61,653 ఆదా యం లభించినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానందిలోని అభిషేక మండపంలో శనివారం ఉభయ ఆలయాల హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ మోహన్ పర్యవేక్షణలో కానుకలను లెక్కించారు. శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి, కోదండరామాలయం, ఆంజనేయస్వామి, కోదండ రామాలయాల్లోని హుండీల్లో 50 రోజులకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 48,04,588 ఆదాయం వచ్చిందన్నారు. అన్నప్రసాదం, గో సంరక్షణ విభాగాల ద్వారా రూ. 57,065.. మొత్తం రూ. 48.61 లక్షలు లభించిందన్నారు. నగదు కానుకలతో పాటు 9 గ్రాముల 90 మిల్లీ గ్రాముల బంగారు, 470 గ్రాముల వెండి భక్తులు సమర్పించారన్నారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ పి.సుబ్బారెడ్డి, ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
శిఖరేశ్వరం అభివృద్ధికి చర్యలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్ర పరిధిలోని శిఖరేశ్వరం వద్ద పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన శిఖరేశ్వరం ఆలయాన్ని పరిశీలించారు. కోనేరు, ఆలయం చుట్టూ క్షేత్ర విశిష్టతలను తెలిపే బొమ్మలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ శివ లింగానికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. టికెట్ కౌంటర్ వద్ద విరాళ సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.
33 మంది ఎస్‌ఐలకు త్వరలో పదోన్నతి
కర్నూలు: పోలీసు శాఖ ఫోర్త్ జోన్ (రాయలసీమ జోన్) పరిధిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 33 మంది ఎస్‌ఐలకు సీఐలుగా పదోన్నతి కల్పించేందుకు ప్యానెల్ జాబితా సిద్ధమైంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల్లోని శాంతి భద్రతల (లా అండ్ ఆర్డర్ స్టేషన్లు) విభాగంతో పాటు సీఐడీ, రైల్వే, ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ తదితర లూప్‌లైన్ విభాగాల్లో పనిచేస్తున్న 33 మంది ఎస్‌ఐలు ప్రభుత్వ అనుమతితో సీఐలుగా పదోన్నతి పొందనున్నారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8 మంది, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 6గురు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 9 మంది, వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు ఎస్‌ఐలు పదోన్నతి జాబితాలో ఉన్నారు. లూప్‌లైన్ విభాగాల్లో పనిచేస్తున్న మరో 8 మంది ఎస్‌ఐలు కూడా పదోన్నతి జాబితాలో ఉన్నారు. ఈ మేరకు జాబితా విడుదలైంది.
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి
కర్నూలు(అర్బన్): అనంతపురం జిల్లా పంచా యతీ అధికారి టి. నాగరాజునాయుడు పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ నానా దుర్భాషలాడిన తాడి పత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాల్మీకి నేతలు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వాల్మీకి/ బోయ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు కుబేరస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు తలారి కృష్ణమనాయుడు, ప్రధాన కార్యదర్శి బస్తిపాటి మల్లికార్జున, బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె. శ్రీనివాసులునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగరాజునాయుడుపై జరిగిన సంఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో ఉన్న జిల్లా అధికారి పట్ల జేసీ ప్రవర్తించిన తీరును చూస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సుపరిపాలన అంటే ఇదేనా అని వారు ప్రశ్నించారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, పీఆర్‌అండ్‌ఆర్‌డీ మంత్రి పవన్‌కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.

మహానందీశ్వరుడికి రూ. 48.61 లక్షల ఆదాయం