బనగానపల్లె: స్థానిక కొండపేటలోని రాంభూపాల్‌రెడ్డి నగర్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన విద్యుత్ ప్రమాదంలో సోదరులు షేక్ బషీర్, షేక్ షఫీబాషా గాయపడ్డారు. ఇంటి నిర్మాణం సమయంలో షేక్ బషీర్ సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా వర్షం కురిసింది. ఇంటి పక్కనే ఉన్న 11/కేవీకి చెందిన విద్యుత్ వైర్ల నుంచి విద్యుత్ ప్రసారం కావడంతో బషీర్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన అతని సోదరుడు షఫీబాషా కర్రతో కాపాడే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
కారు టైరు పేలి వ్యక్తి దుర్మరణం
జూపాడుబంగ్లా: కర్నూలు – హైదరాబాద్ రహదారిపై కొత్తకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జూపాడుబంగ్లా మండలం పి.లింగాపురం గ్రామానికి చెందిన ఓంకార్‌నాగిరెడ్డి (35) దుర్మరణం చెందాడు. ఓంకార్ నాగిరెడ్డి భార్య వర్షిణి అనారోగ్యంగా ఉండటంతో చికిత్స నిమిత్తం శనివారం ఉదయం పెద్దమ్మ ప్రమీలమ్మ, బంధువు ప్రభాకర్‌రెడ్డితో కలసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో కారు టైరు పేలి అదుపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఓంకార్‌రెడ్డి కారులోంచి విసురుగా బయటపడటంతో తల రోడ్డుకు తగిలి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామసర్పంచ్ నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ పోచా జగదీశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు నాగిరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
మహిళా పీఎస్ డీఎస్పీగా ఉపేంద్ర బాబు
కర్నూలు: కర్నూ లు మహిళా పీఎస్ డీఎస్పీగా ఎం.ఉపేంద్ర బాబు నియమితులయ్యారు. ఇక్కడున్న శ్రీనివాసాచారిని గుంతకల్లు డీఎస్‌ఆర్‌పీకి బదిలీ చేసి ఎమ్మిగనూరులో పనిచేస్తున్న ఉపేంద్ర బాబును మహిళా పీఎస్‌కు నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు డీఎస్పీలకు స్థాన చలనం కల్పిస్తూ ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఇద్దరు డీఎస్పీలకు స్థాన చలనం కలిగింది. శ్రీనివాసాచారి గత ఏడాది ఆగస్టు 9వ తేదీన కర్నూలు మహిళా పీఎస్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది కూడా గడవకముందే ఆయనపై బదిలీ వేటు పడటం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. అలాగే ఉపేంద్రబాబు కూడా గత ఏడాది సెప్టెంబర్ 19న ఎమ్మిగనూరు డీఎస్పీగా నియమితులయ్యారు. ఆయనను కూడా అనతికాలంలోనే బదిలీ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. కాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి డీఎస్పీగా నియమితులైన మర్రివాడ భార్గవిని ఎమ్మిగనూరుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
విద్యుదాఘాతంతో ఇద్దరికి గాయాలు
విద్యుదాఘాతంతో ఇద్దరికి గాయాలు
విద్యుదాఘాతంతో ఇద్దరికి గాయాలు