
హంద్రీ–నీవా.. అక్రమాలు కనవా!
కర్నూలు జిల్లాలో 80వేల ఎకరాల ఆయకట్టు
● హంద్రీ–నీవా సుజల స్రవంతి రాయలసీమ
ప్రాంతంలో పొడవైన కాలువ.
● దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
పాలనలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.
● కాలువ మొదటి దశ మల్యాల వద్ద మొదలై
రాయలసీమ జిల్లాల్లో పారుతుంది.
● ఈ కాలువ మొత్తం 6.025 లక్షల ఎకరాలకు
సాగునీరు అందిస్తుంది.
● రాయలసీమ జిల్లాలకు చెందిన 33 లక్షల
మందికి తాగునీరు అందిస్తుంది.
● ఈ కాలువ కింద కర్నూలు జిల్లాలో 80 వేల
ఎకరాల ఆయకట్టు ఉంది.
● జిల్లాలో 0.161 టీఎంసీల సామర్థ్యంతో
కృష్ణగిరి, 1.126 టీఎంసీల సామర్థ్యంతో
పందికోన రిజర్వాయర్లు ఉన్నాయి.
● హంద్రీ–నీవా ప్రధాన కాలువలో
అసంపూర్తిగా లైనింగ్ పనులు
● నాసిరకంగా మరమ్మతులు
● కాలువలో తొలగని మట్టి గుట్టలు
● నేడు నీరు విడుదల చేయనున్న
సీఎం చంద్రబాబు
కర్నూలు సిటీ/నందికొట్కూరు/పాములపాడు: రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం జిల్లాల రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు అందించే హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాల్వ అధ్వానంగా మారింది. కాల్వలో ఎక్కడి గుట్టలు అక్కడే ఉండిపోయాయి. లైనింగ్ పనులు నాసిరకంగా జరిగాయి. కాంట్రాక్టర్లు కనీసం పిచ్చి మొక్కలను సైతం తొలగించలేకపోయారు. మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి నేడు(గురువారం) హంద్రీ–నీవా ప్రధాన కాలువకు సీఎం చంద్రబాబు నీరు వదలనున్నారు. కాలువకు నీరు వదిలితే నాసిరకంగా నిర్మించిన లైనింగ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాంట్రాక్టర్లు అయిన టీడీపీ నాయకులు నాణ్యత లేకుండా హంద్రీ–నీవా ప్రధాన కాలువకు మరమ్మతులు చేశారు. పనులు నాసిరకంగా చేసి జేబులు నింపుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి ప్రధాన కాలువపై నిర్మించిన 6వ బ్రిడ్జి వద్ద మట్టి, రాళ్ల గుట్టను కాంట్రాక్టర్లు అలాగే వదిలేశారు. అలాగే ఆ బ్రిడ్జి వద్ద హంద్రీనీవా కాలువ లైనింగ్ నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టారు. నాణ్యత లేకుండా కాంట్రాక్టర్లు చేసిన పనులకు ఇవి గుర్తుగా మిగిలాయి. హంద్రీ–నీవా కాలువ అధ్వానంగా ఉండగా సీఎం చంద్రబాబు వదిలిన నీరు ఆయకట్టుకు చేరుతుందా.. ప్రజల గొంతు తడుపుతుందా.. అనే ప్రశ్నలు వస్తున్నాయి.
‘చంద్ర’ గ్రహణం
హంద్రీ–నీవా కాలువ నిర్మాణానికి 1996 మార్చి 11న ఉరవకొండలో, 1999 జూలై 9న ఆత్మకూరులో ఎన్.చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసినా హంద్రీ– నీవాను పట్టించుకోలేదు. అయితే ‘తానే హంద్రీ–నీవాను తెచ్చానని, అదే తన ఆలోచన’ అని తప్పు ప్రచారం చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ వెనుకటి జలాలను 40 టీఎంసీలను ఈ కాలువ ద్వారా తరలించాల్సి ఉంది. చంద్రబాబు హయాంలో 2017–18లోనే విస్తరణ పనులు కొంత చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
● హంద్రీ– నీవా కాంట్రాక్ట్‌ల నుంచి డిస్ట్రిబ్యూటరీ పనులను తొలగిస్తూ 2015 ఫిబ్రవరి 23న చంద్రబాబు జీఓ నంబరు 22 ను జారీ చేశారు. దీంతో జిల్లాతో పాటు, సీమలోని మిగిలిన జిల్లాల్లోనూ డిస్ట్రిబ్యూటరీల పనులు సైతం నిలిచిపోయాయి. దీంతో ఆయకట్టు కాకుండా కేవలం చెరువులను నింపేందుకు మాత్రమే హంద్రీ–నీవాను వినియోగించుకుంటున్నారు.
● టీడీపీ పాలనా కాలంలో 2017–18లో ప్రధాన కాలువను 3,850 క్యూసెక్కులకు విస్తరించేందుకు చేపట్టిన మట్టి పనుల్లో భారీగా అవినీతి జరిగింది. లైనింగ్ చేసి చోట సైతం నాణ్యత పాటించకపోవడంతో కంకర తేలింది. అప్పట్లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ రెండు ప్యాకేజీల్లో రూ.385.59 కోట్లతో విస్తరణ పనులు చేశారు.
ఆలస్యంగా పనులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హంద్రీ– నీవా కాలువ విస్తరణ పనులు అస్తవ్యస్తంగా సాగాయి. జూన్ 10 నాటికే విస్తరణ పనులు కాంట్రాక్టర్లు పూర్తి చేయలేకపోయారు. ఈ నెల మొదటి వారంలో విస్తరణ పనులపై జరిగిన సమీక్షలో 12వ తేదీకి ఓ కాంట్రాక్టర్, 14వ తేదీకి మరో కాంట్రాక్టర్ పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. మొదటి ప్యాకేజీలో కల్లూరు మండలం వామసముద్రం దగ్గర, సఫా ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఇంకా పూర్తి కాలేదు. సెకండ్ ప్యాకేజీలోను పనులు పూర్తి కాలేదు. అయితే నీటి విడుదలపై ఒత్తిళ్లు ఉండడంతో పనులు పూర్తి అయ్యాయని చెబుతున్నారు. కాల్వ విస్తరణ పనులు ఒక్కో చోట ఒక్కో కొలతతో చేసినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్‌సీపీ
హయాంలో ఇలా..
హంద్రీ–నీవా కాలువ సామర్థ్యం తగ్గడంతో చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు ఆశించిన స్థాయిలో చేరడం లేదు. శ్రీశైలం డ్యాం వెనుక జలాలను తక్కువ రోజుల్లోనే ఎక్కువ తరలించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అంచనాలు వేసింది. కాల్వ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు విస్తరించే పనులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే మొదటి ఫేజ్ పరిధిలో రెండు ప్యాకేజీలుగా రూ.687 కోట్లతో అంచనాలు వేసి టెండర్లు పిలిచింది. ఎన్నికల కోడ్ రావడంతో గతేడాది పనులు మొదలు పెట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలస్యంగా పనులు మొదలు పెట్టారు.

హంద్రీ–నీవా.. అక్రమాలు కనవా!

హంద్రీ–నీవా.. అక్రమాలు కనవా!