
తెలుగుగంగకు నీరు విడుదల
రుద్రవరం: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నుంచి తెలుగుగంగ ప్రధాన కాల్వలకు అధికారులు 3,000 క్యూసెక్యుల సాగునీరు విడుదల చేశారు. ఆ నీరు బుధవారం నాటికి రుద్రవరం మండలానికి చేరుకుంది. ఆ నీరు ప్రధానకాల్వలో పాటు రుద్రవరానికి సమీపాన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న తుండ్లవాగు( గండ్లేరు) రిజర్వాయర్‌లోకి చేరుతోంది. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పంటలు వర్షం కురవక వాడు ముఖం పట్టాయి. అలాంటి పంటలకు తెలుగుగంగ నీటిని వాడుకునే అవకాశం ఉంది.
ఉద్యాన పంటలకు వందశాతం సబ్సిడీ
కోవెలకుంట్ల: ఉద్యాన పంటలకు సాగుకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీ ఇస్తోందని డ్వామా పీడీ సూర్యనారాయణ తెలిపారు. కోవెలకుంట్ల మార్కెట్‌యార్డులో బుధవారం ‘ఉపాధి’ ఏపీఓలు, టెక్నికల్, ఫీల్ట్ అసిస్టెంట్లు ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. మామిడి, సపోట, చీని, జామ, నిమ్మ, కొబ్బరి తదితర రకాల పండ్ల తోటల సాగుకు మొక్కల సరఫరా చేస్తామన్నారు. మొక్కల సంరక్షణకు మూడేళ్లపాటు నిధులు కేటాయిస్తామని చెప్పారు.
ఆర్‌అండ్‌బీ కర్నూలు ఈఈగా సునీల్‌రెడ్డి
కర్నూలు(అర్బన్): రోడ్లు భవనాల శాఖ కర్నూలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా సీవీ సునీల్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఈగా విధులు నిర్వహించిన బి.సురేష్‌బాబును ప్రభుత్వం ఎస్‌ఈగా పదోన్నతి కల్పించి చిత్తూరుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా కోవెలకుంట్ల డీఈఈగా విధులు నిర్వహిస్తున్న సునీల్‌రెడ్డికి ఈఈగా పదోన్నతి కల్పించి కర్నూలుకు బదిలీ చేశారు. ఈఈగా బాధ్యతలు చేపట్టిన సునీల్‌రెడ్డికి ఈఈ సిద్దారెడ్డి, కార్యాలయ డీఏఓ ఓ పురుషోత్తంరెడ్డి, హెచ్‌డీ చంద్రశేఖర్‌బాబు, డివిజన్ పరిధిలోని డీఈఈ, ఏఈలు, కార్యాలయ సిబ్బంది పూలబోకేలు అందించి అభినందనలు తెలిపారు.
28న షూటింగ్‌బాల్ ఎంపిక పోటీలు
కర్నూలు (టౌన్): నగరంలోని గుడ్ షప్పర్డ్ స్కూల్ మైదానంలో ఈనెల 28న జిల్లా స్థాయి జూనియర్స్ షూటింగ్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో విజేత జట్లకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులు వచ్చే నెల మొదటి వారంలో నె ల్లూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్స్ షూటింగ్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.

తెలుగుగంగకు నీరు విడుదల