
పాముకాటుతో మహిళ మృతి
రుద్రవరం: మండలంలోని ఎర్రగుడిదిన్నెకు చెందిన నాగలక్ష్మమ్మ (54) పాము కాటుకు గురై మృతి చెందింది. ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో రైతు పెద్ద నరసింహులు కుటుంబం పాడి గేదెలను మేపుతూ జీవనం సాగిస్తోంది. భార్య నాగలక్ష్మమ్మ రోజూ గేదెలను మేతకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో పొలం గట్లపై గడ్డి కోసి తీసుకొచ్చేది. బుధవారం ఉదయాన్నే వెళ్లి గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. అక్కడున్న పాడి రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
జర్నలిస్టు హెల్త్ స్కీం పొడిగింపు
కర్నూలు(సెంట్రల్): వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీంను 2025–26 ఆర్థిక సంవత్సరానికి పొడిగించినట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.జయమ్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీఓ నంబర్ 77 విడుదల చేసిందన్నారు. అయితే డబ్ల్యూజేహెచ్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవడానికి రూ.1,250 ప్రీమియం చెల్లించాలని సూచించారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజినల్ చలానా, దరఖాస్తు, రెన్యూవల్ చేయించుకున్న అక్రిడిటేషన్ జిరాక్స్ కాపీలను కలెక్టరేట్‌లో ఉన్న సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.