
కేంద్ర పథకాలపై ప్రత్యేక బృందం తనిఖీ
ఎమ్మిగనూరురూరల్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై బుధవారం మండల పరిధిలోని కె.తిమ్మాపురం గ్రామంలో సెంట్రల్ టీమ్ సభ్యులు పర్యటించి, తనిఖీలు ినిర్వహించారు. ఉపాధి హామీ కింద చేపట్టిన పనులు, చెక్ డ్యామ్‌ల పనితీరును పరిశీలించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించి గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు సంతోష్ పరీద్, సూర్యకాంత్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం అమలు, పెన్షన్లు, గృహ నిర్మాణాలతో పాటు ఇతర పథకాలను అమలు చేస్తోందని, అవన్నీ లబ్ధిదారులకు చేరుతున్నాయా, వాటి వల్ల ఉపయోగం పొందారా? అనే అంశాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. పథకాల అమల్లో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఏపీడీ అల్లీపీరా, హౌసింగ్ డీఈ ప్రసాద్, సీఎల్‌ఆర్సీ కోర్సు డైరెక్టర్ ప్రదీప్‌కుమార్, ఈఓఆర్డీ విజయలక్ష్మి, ఏపీఓ విజయమోహన్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఈసీ, టీఏలు, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.