
ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయొద్దు
నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయొద్దని, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కుదింపు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెపాపరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నంద్యాల టెక్కె మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ చేశారు. అనంతరం గాంధీచౌక్ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజులు మాట్లాడారు. కార్మికులందరికీ కనీస వేతనాలను అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చెయ్యాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు.
– అంగన్‌వాడీ జిల్లా కార్యదర్శి ఎం.నిర్మలమ్మ, నాయకురాలు సునీత, వీఓఏల సంఘం జిల్లా కార్యదర్శి మిట్నాల తిరుపతయ్య, కార్మిక, రైతు, వామపక్ష పార్టీల నాయకులు తోట మద్దులు, మహమ్మద్‌గౌస్, ప్రసాద్, శ్రీనివాసులు మాట్లాడుతూ.. పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. సమస్యలను పరిష్కారం చేయకుంటే పెద్ద ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు కార్మికులంతా ఐక్యంగా ఉన్నామని హెచ్చరించారు. వామపక్ష ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం కార్యదర్శి రాజశేఖర్, వెంకటలింగం, పుల్లా నరసింహులు, లక్ష్మణ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలదుర్గన్న, శ్రీనివాసులు, ఓబులేసు తదితురులు పాల్గొన్నారు.
అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి
సార్వత్రిక సమ్మెలో కార్మిక, రైతు సంఘాల నాయకులు