దేవరకొండ : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన డివిజన్‌స్థాయి ప్రజావాణిలో కలెక్టర్ మాట్లాడారు. డివిజన్ స్థాయిలో వచ్చే ప్రజావాణి సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. వారం రోజుల్లో ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కారం కావాలని, ఒకసారి వచ్చిన ఫిర్యాదుదారుడు మళ్లీ రాకుడదని చెప్పారు. దేవరకొండ, కొండమల్లేపల్లి పట్టణాల్లో ఎఫ్‌టీఎల్ నిర్ధారించాలని.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రజావాణికి హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ రానున్న సమాచారం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదులు అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ పద్మప్రియ, డీఎస్పీ శ్రీనివాసరావు, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.


