నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 43 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు ఆయనకు వినతులు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా జయలత
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా డాక్టర్ జయలత బదిలీపై వచ్చారు. ఆమె సూర్యాపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ బదిలీపై న్లగొండకు వచ్చారు. సోమవారం ఆమె.. ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ వైద్యులు, మెడికల్ కళాశాల బాధ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్‌నాయక్ పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆ ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్
నాంపల్లి : మండలంలోని షర్బాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బేక్కం వీరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శనివారం డీఈవో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ మల్లికార్జునరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయుడి కుటుంబ కలహాల్లో భాగంగా ప్రజావాణిలో పలు ఫిర్యాదులు రావడం, ఆయన తన భార్య పేరు మీద చిట్టీలు వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు పేర్కొన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి
రామగిరి (నల్లగొండ) : రైతులందరు తప్పనిసరిగా పార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి.వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం నల్లగొండ మండలంలోని కొత్తపల్లిలో నిర్వహించిన ఫార్మర్ రిజిస్ట్రీ క్యాంపెయిన్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు రిజిస్ట్రీ చేయించుకోవడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సబ్సిడీలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను సులభంగా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ సుంకోజు శ్రీనివాస్, ఏఈఓ శోభ, గ్రామ రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


