ఫ నిర్లక్ష్యం నీడలో ఉప్పలపహాడ్ మూసీ బ్రిడ్జి
ఫ కూలిన రక్షణ గోడలు, పట్టించుకోని అధికారులు
కేతేపల్లి : మూసీ నదిపై నిజాం కాలంలో నిర్మించిన చారిత్రాత్మక వంతెన నిర్వహణను పట్టించుకోక పోవటంతో శిథిలావస్థకు చేరింది. 2010లో 65వ నంబర్ జాతీయ రహదారి నాలుగులేన్లుగా విస్తరించిన సమయంలో కేతేపల్లి మండలంలోని ఉప్పలపహాడ్, సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామాల మధ్య మూసీ నదిపై వారధిగా ఉన్న ఈ వంతెనకు సమాంతరంగా రెండు వరుసలుగా నూతనంగా మరో వంతెన నిర్మించారు. అప్పటి నుంచి ఈ పాత వంతెనను అధికారులు పట్టించకోవడం లేదు. ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో వంతెన రెయిలింగ్ దిమ్మెలను పగులగొట్టి అందులో ఉన్న ఇనుపరాడ్లను దుండుగులు ఎత్తుకెళ్లారు. వంతెనపై రాగి చెట్లు మొలుస్తుండటంతో వంతెన గోడల పగుళ్లు ఏర్పడుతున్నాయి. వర్షం నీరు కిందకు పోయే రంద్రాలు మూసుకపోవటంతో వంతెనపై నీరు నిలిచి గుంతలు ఏర్పడి రోడ్డు ధ్వంసమవుతోంది.
నిత్యం వాహనాల రాకపోకలు..
సూర్యాపేట నుంచి మిర్యాలగూడ సుమారు 25 గ్రామాలను కలుపుతూ వెళ్లే వాహనాలు ఈ వంతెన మీదుగానే వెళ్లాల్సి ఉంది. పాత వంతెన పైనుంచే మండలంలోని ఉప్పలపహాడ్, తుంగతుర్తి, చెర్కుపల్లి గ్రామాలతో పాటు నకిరేకల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన వాహనాలు ఈ వంతెన పైనుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. వంతెనకు ఇరువైపుల ఉన్న రక్షణ దిమ్మెలు ధ్వంసం కావడంతో వంతెనపై నుంచి వెళ్లే వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పాత వంతెనకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.


