సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మహిళల ఆర్థిక స్వావలంభనకు మరో అడుగు పడింది. ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా ప్రతి మండల సమాఖ్యకు ప్రభుత్వం ఒక్కో బస్సును కేటాయించింది. ఈ పథకం కింద జిల్లాలో 32 మహిళా సమాఖ్యలకు 32 బస్‌లను అందజేస్తోంది. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ బస్సులను ప్రారంభించనున్నారు. ఆర్టీసీకి ఈ బస్సులను అద్దెకు ఇవ్వడంతో ఒక్కో సమాఖ్యకు ప్రతినెలా అదనపు ఆదాయం సమకూరనుంది. మహిళల ఆర్థిక సాధికారితకు, ఆత్మ విశ్వాసానికి, స్వయం సమృద్ధికి ఈ బస్సులు ప్రతీకలుగా నిలువనున్నాయి. ఈ బస్సులతో మహిళలు యాజమానులుగా మారనున్నారు.
ప్రభుత్వం రూ.30 లక్షలు, మహిళా సమాఖ్య రూ.6 లక్షలు
మహిళా సమాఖ్యలకు అందజేస్తున్న ఒక్కో బస్ విలువ రూ.36 లక్షలు. ఇందులో కమ్యూనిటీ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (సీఐఎఫ్) ద్వారా ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.30 లక్షలు అందించగా, సంబంధిత మహిళా సమాఖ్యలు రూ.6 లక్షలు వాటాగా చెల్లించాయి. దాని ద్వారా బస్‌లను కొనుగోలు చేసి వాటన్నింటిని ఆర్టీసీకి అప్పగించారు.
మహిళా అభివృద్ధికి వేదిక
ఇందిరమ్మ మహిళా శక్తి పథకం మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగా గాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రతి నియోజక వర్గంలో ఇప్పటికే మహిళా శక్తి భవనాలు నిర్మించుకున్నారు. జిల్లాలో రాష్ట్రస్థాయి నుంచి ఒక పెట్రోల్ బంక్ మంజూరైంది. అది నిర్మాణ దశలో ఉంది. జిల్లా స్థాయి నుంచి మరో 3 బంక్‌ల ఏర్పాటుకు భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే కలెక్టరేట్‌లో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్‌ను నిర్వహిస్తున్నారు. జిల్లాలో మూడు రైస్ మిల్లుల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నారు. తిరుమలగిరిసాగర్ అల్వాల, చండూరు మండల కేంద్రంలో సోలార్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 32 బస్‌లు రావడంతో వారికి మరింత ఆర్థిక తోడ్పాటు దక్కనుంది.
నార్కట్‌పల్లి మహిళా సమాఖ్య బస్సు
ఫ జిల్లాలోని 32 మండల మహిళా సమాఖ్యలకు 32 బస్సులు
ఫ ఒక్కో బస్ విలువ రూ.36 లక్షలు
ఫ ప్రతి నెలా రూ.69,468 అద్దె చెల్లించనున్న ఆర్టీసీ
ఫ మహిళల ఆర్థిక సాధికారితకు ప్రతీకగా నిలువనున్న బస్సులు
సూర్యాపేటకు 23, యాదాద్రికి 17
నల్లగొండ జిల్లాలోని మహిళా సమాఖ్యలకు 32 బస్సులను కేటాయించిన ప్రభుత్వం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండల సమాఖ్యలకు 17 బస్సులు కేటాయించింది. సూర్యాపేట జిల్లాకు 23 బస్సులు వచ్చాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాకు 72 బస్సులు కేటాయించారు.


