వేములపల్లి : ఇల్లు లేని ప్రతి పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో 14 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలతోపాటు మహిళా సంఘ భవన నిర్మాణ పనుల శంకుస్థాపనలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఇంటికి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో 931 మహిళా సంఘ భవనాల ఏర్పాటుతో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా అగ్రభాగంలో ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఇప్పటికే 7.49లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. సాదాబైనామా దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్‌పీఓ ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాకు సుమారు 4కిలోల వరకు తరుగు తీసి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని రైతులు వారికి ఫిర్యాదు చేశారు. దానిపై సమగ్ర విచారణ చేపట్టి తనకు నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు.
ఎమ్మెల్యే పల్లెబాట..
ప్రజల మధ్యన ఉంటూ వారి సమస్యలను తెలుసుకోని వాటిని పరిష్కరించి తగిన న్యాయం చేసేందుకు ‘ప్రగతి సింగిడి జనంతో మాట పల్లె బాట’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, రాబోవు రెండున్నర సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాలను అనుసంధానం చేయడమే ప్రగతి సింగిడి అన్నారు. ఈనెల 15 తరువాత వారంలో ఐదు రోజులపాటు నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి రాత్రి ఆ గ్రామాల్లో బసచేసి తెల్లారి ఉదయం అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సీఐ పీఎన్‌డీ.ప్రసాద్, తహసీల్దార్ హేమలత, ఎంపీడీఓ జితేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు పిల్లల సందీప్, ఝెల్లికట్టి భరత్, ఉప సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి సయ్యద్ జాని, నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, స్కైలాబ్‌నాయక్, మాలి కాంతారెడ్డి, రావు ఎల్లారెడ్డి, దేశబోయిన రవికుమార్, బంటు చొక్కయ్యగౌడ్, రేగట్టె రవీందర్‌రెడ్డి, బ్రహ్మదేవర విద్యాసాగర్, తాళ్ల వెంకటేశ్వర్లు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
ఫ ఆమనగల్లులో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు


