నకిలీలపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

నకిలీలపై ఉక్కుపాదం

Jun 8 2026 9:53 AM | Updated on Jun 8 2026 9:53 AM

దేవరకొండ : విత్తనాల విషయంలో రైతులు మోసాలకు గురికాకుండా నాణ్యమైన విత్తనాలతో పంటలు సాగు చేసేలా సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగు కోసం విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు సంయుక్తంగా నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

12,02,051 ఎకరాల్లో సాగు అంచనా..

ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలు రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దానిలో వరి 5,86,137 ఎకరాల్లో, పత్తి 5,30,524 ఎకరాల్లో, కంది 14 వేల ఎకరాల్లో, ఇతర పంటలు కలిపి మొత్తం 12.02 లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

నకిలీ విత్తనాలతోరైతులకు నష్టం

గతంలో కొందరు దళారులు ఇతర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అంటగట్టిన ఘటనలు ఉన్నాయి. ఆ విత్తనాలు సాగు చేసిన రైతులు పంట దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ప్రభుత్వం అనుమతిచ్చిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను మాత్రమే రైతులకు విక్రయించాలని దుకాణదారులను ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులకు సంబంధించి రశీదు ఇవ్వాలని, స్టాక్‌ వివరాలను డిస్‌ ప్లే చేయాలని దుకాణాదారులకు సూచిస్తున్నారు. రైతులు గ్రామాల్లో దళారులను నమ్మి మోసపోకూడదని, నకిలీ విత్తనాలు విక్రయించే వారి సమాచారం ఉంటే అధికారులకు తెలియపర్చాలని కోరుతున్నారు.

ఫ విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు

ఫ నాణ్యమైన విత్తనాలు

విక్రయించాలని ఆదేశాలు

ఫ దళారులను నమ్మి

మోసపోవద్దని రైతులకు సూచన

Advertisement
 
Advertisement
Advertisement