ఫ 11 అడుగులకు చేరిన నీటిమట్టం
శాలిగౌరారం : జిల్లాలో మద్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. మూసీనదిపై ఉన్న మూసీ ప్రాజెక్టుకు ఎగువ భాగాన శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరువచ్చేందుకు పల్లివాడ వద్ద నిర్మించిన ఆనకట్ట చివరిది. పల్లివాడ ఆనకట్టకు ఎగువభాగంలో అసిఫ్‌నహర్, భీమలింగం, ధర్మారెడ్డి, బునాదిగాని, పిల్లాయిపల్లి, బాచారం ఆనకట్టలు ఉన్నాయి. ఈ ఆనకట్టల వద్ద మూసీనదికి ఇరువైపుల ఉన్న కాలువల పరిధిలో ప్రస్తుతం నీటిని నిలిపివేయడంతో మూసీనది ప్రవాహం నేరుగా పల్లివాడ ఆనకట్ట మీదుగా మూసీనదిలోకి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో పల్లివాడ ఆనకట్ట వద్ద ఉన్న హెడ్‌రెగ్యూలేటర్ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టు రాచకాల్వలోకి నీటిని మళ్లించడంతో మూసీనదిలోని వరదనీరు శాలిగౌరారం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది..
పక్షం రోజుల్లో 11 అడుగులకు
చేరిన నీటిమట్టం..
శాలిగౌరారం ప్రాజెక్టు 1200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి సామర్థ్యంతో 6 వేల ఎకరాల ఆయకట్టును కలిగి ఉంది. గడిచిన యాసంగి పంటకు నీటిని నిలిపివేసేనాటికి ప్రాజెక్టు నీటిమట్టం 4 అడుగులకు పడిపోయింది. గతనెల 24 నుంచి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో 15 రోజుల్లో ప్రాజెక్టు నీటిమట్టం 11 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు నుంచి ప్రస్తుత వానాకాలం సీజన్‌కు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


