కిలో పండ్ల ధర రూ.రెండున్నర లక్షలు
ఫ సిరిపురంలో పెంచుతున్న శేషుకుమార్
ఫ తొలిసారి కాతకొచ్చిన జపాన్ రకం మియాజాకి
ఫ దేశీయ, విదేశీ రకాలను కూడా సాగుచేస్తున్న అభ్యుదయ రైతు
నడిగూడెం : మామిడిని సాధారణంగా ఫలరాజు అంటుంటాం. అన్ని ఫలాల్లో కంటే రారాజుగా పిలువబడే మామిడిలో ప్రపంచంలోనే అరుదైనది.. అత్యంత ఖరీదైనది ‘మియాజాకి’ రకం. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన రైతు వాసికర్ల శేషుకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో మియాజాకి రకం మామిడిని సాగుచేస్తున్నారు. ఎకరంన్నర విస్తీర్ణంలో సేంద్రియ పద్ధతిలో ఆయన దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల మామిడి మొక్కలు పెంచుతున్నారు. అందులో మియాజాకి కూడా ఉంది. శేషుకుమార్ మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని కడియం నుంచి ఒక్కో మొక్కకు రూ.1200 చొప్పున పెట్టి మూడు మొక్కలు తెచ్చి నాటగా ఒక మొక్క చనిపోయింది. మిగతా రెండు మొక్కలు పెరిగాయి. ఈ ఏడాది తొలిసారిగా 20కి పైగా కాయలు కాశాయి. మియాజాకి మామిడి పండ్ల ధర కిలోకు రెండున్నర లక్షల రూపాయల ఉంటుందని, ఈ రకం పండులో అధికంగా పోషక పదార్థాలు ఉంటాయని రైతు శేషు కుమార్ తెలిపారు. కాయ ఎరుపు రంగులో 300 గ్రాముల నుంచి 400 గ్రాముల బరువు ఉంటుందని చెప్పారు.
బంగినపల్లి, దశేరి, తోతాపూరి, హిమాయత్, కొత్తపల్లి కొబ్బరి, ఆల్ఫాన్సా, చెరకు రసాలు, చిన్న రసాలు, నీలం, పండూరి మామిడి, కేసరి, తెల్ల గులాబి, ఆమ్రపాలి, ముంత మామిడి, మల్లిక, పందిరి మ్యాంగో, కస్తూరి మ్యాంగో తదితర రకాలు సాగులో ఉన్నాయి. ఆయన క్షేత్రంలో ఒక్కో రకం రెండు నుంచి మూడు మొక్కల చొప్పున సాగుచేస్తున్నారు. ఈ మొక్కలను కడియం, జడ్చర్ల నుంచి తెచ్చినట్లు రైతు తెలిపారు. తాను పండించిన అరుదైన రకాలు జపాన్ రకం మియాజాకి, అమెరికన్ థామిట్ క్వీన్, కేసరి పండ్లను ఇటీవల సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఐసీఏఆర్ డైరక్టర్ డాక్టర్. షేక్.మీరాకు అందజేశానని చెప్పారు.
శేషుకుమార్ సాగుచేస్తున్న విదేశీ రకాలు ఇవీ..
మియాజాకి, థామిట్ క్వీన్,
నాసిక్ పసంద్, గోల్డెన్ మ్యాంగో, పర్పుల్ మ్యాంగో, ఫోర్ స్టోన్ మ్యాంగో, క్యాట్‌మెన్ మ్యాంగో, బన్సారా మ్యాంగో, యాపిల్ మ్యాంగో, బర్సూన్ కింగ్, వర్వేటర్, బర్రి మ్యాంగో, టెన్‌కేజీ మ్యాంగో,
బ్లాక్ స్టోన్
మ్యాంగో.
గత ఐదేళ్ళుగా పండ్ల తోటలు, కూరగాయలు, అకు కూరలతో పాటు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం చేస్తున్నాను. ప్రత్యేకంగా అర ఎకరంలో అధిక సాంద్రత పద్ధతిలో 270 మామిడి మొక్కలను సాగు చేస్తున్నాను. దేశ, విదేశాలలో ఉన్న దాదాపు అన్ని రకాలను సాగు చేస్తున్నా. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులను వాడకుండా సహజ సిద్ధంగా సాగు చేస్తున్నా. నిత్యం ఆదాయం పొందుతున్నాను.
– వాసికర్ల శేషు కుమార్, అభ్యుదయ రైతు, సిరిపురం


