పిల్లలే మన భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

పిల్లలే మన భవిష్యత్తు

Jun 7 2026 9:06 AM | Updated on Jun 7 2026 9:06 AM

ముఖ్య ఉద్దేశం ఇదీ..

పిల్లలు తమ సమస్యలను స్వయంగా వ్యక్తపరిచి, సమాజ అభివృద్ధిలో చురుకై న భాగస్వాములుగా ఎదగడమే బాల పంచాయతీ ప్రధాన ఉద్దేశం. గ్రామానికి బస్సు సౌకర్యం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య ఇంకా ఏ ఇతర సమస్యలు వస్తే.. సంబంధిత శాఖ అధికారుల వద్దకు నేరుగా వెళ్లి విద్యార్థులే వ్యక్తపరచడం. విద్య, ఆరోగ్యం, గ్రామ సమస్యలను గుర్తించి పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత శాఖ అధికారులకు చిన్నప్పటినుంచే చేరవేయడాన్ని విద్యార్థులు నేర్చుకోవాలి. వారి హక్కులు, బాధ్యతలను నేర్చుకోవడం ద్వారా ఉత్తమ పౌరులుగా ఎదిగేలా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

కనగల్‌ : ‘పిల్లలే మన భవిష్యత్తు. వారికి సమయం ఇవ్వండి, వారి ఆలోచనలను వినండి, ప్రోత్సహించండి’ అని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్తు అన్నారు. కనగల్‌ మండలంలోని చర్లగౌరారం గ్రామంలో శనివారం జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల పంచాయతీ’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. పిల్లల హక్కులు, వారి భవిష్యత్‌ నిర్మాణం సమాజానికి ఎంతో ముఖ్యమన్నారు. పిల్లల రక్షణ కుటుంబం నుంచే ప్రారంభమవుతుందని, తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయిస్తూ వారి ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరైన మార్గనిర్దేశం చేస్తే భవిష్యత్‌లో సమాజానికి ఉపయోగపడే నాయకులుగా ఎదుగుతారని చెప్పారు. చిన్నారులు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచాలని, సమాజంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే పిల్లలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలమని తెలిపారు. బాలలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం యంగిస్థాన్‌ ఎన్జీఓ ఆశ్రిత బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, సురక్షిత బాల్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిలకరాజు సునీత వెంకటేశం, ఏఎస్పీ రమేష్‌, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎంపీడీఓ వేద రక్షిత, సీఐలు ఆదిరెడ్డి, రాము, కరుణాకర్‌, ఎస్‌ఐ అంజలి, రాజీవ్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఈఓ సుశీందర్‌రావు, సీడబ్ల్యూసీ చైర్మన్‌ కృష్ణయ్య, ఆర్టీఏ మెంబర్‌ కుసుకుంట్ల రాజిరెడ్డి, ఉపసర్పంచ్‌ కలపూరి నాగరాజు, చీదేటి సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్తు

ఫ చర్లగౌరారంలో బాల పంచాయతీ

Advertisement
 
Advertisement
Advertisement