ఎడుస్యూర్‌ మ్యాగజైన్‌లో అనాజిపురం మోడల్‌ స్కూల్‌ | - | Sakshi
Sakshi News home page

ఎడుస్యూర్‌ మ్యాగజైన్‌లో అనాజిపురం మోడల్‌ స్కూల్‌

Jun 7 2026 9:06 AM | Updated on Jun 7 2026 9:06 AM

పెన్‌పహాడ్‌ : పెన్‌పహాడ్‌ మండలంలోని అనాజిపురంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న ఈ–మ్యాగజైన్‌ ఎడుస్యూర్‌ సంచికలో చోటు సంపాదించింది. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా ఎక్స్‌ప్లోరింగ్‌ ది యూనివర్స్‌ ఇన్‌స్పైరింగ్‌ యంగ్‌ మైడ్స్‌ అనే థీమ్‌తో గతేడాది నిర్వహించిన వరల్డ్‌ స్పేస్‌ వీక్‌–2025 కార్యక్రమాలను ఈ మ్యాగజైన్‌ ప్రచురించింది. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ కోడి లింగయ్య వివరాలను వెల్లడించారు. ఎడుస్యూర్‌ తాజా సంచిక 24, 25 పేజీల్లో తమ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాల విశిష్టతను తెలియజేస్తూ ప్రత్యేక కథనం ప్రచురించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని రేకెత్తించాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలలు ఈ కార్యక్రమాలను చేపట్టినా అనాజిపురం మోడల్‌ స్కూల్‌ నిర్వహించిన కార్యక్రమాలు ఉత్తమంగా ఎంపికై ఎడుస్యూర్‌ మ్యాగజైన్‌లో కథనంగా ప్రచురితమవడం పాఠశాల విద్యా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచినట్లు ఆయన తెలిపారు.

అంకితభావంతో సేవలందించాలి

నల్లగొండ టూటౌన్‌ : ప్రతి ఉద్యోగి అంకితభావంతో సేవలందించాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నారు. శనివారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో బోధనేతర సిబ్బందికి నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, కార్యనిబద్ధత, సంస్థకు నిజమైన సేవ అని ప్రతి ఉద్యోగి దార్శనిక ప్రమాణాలతో నడవాలంటూ సూచించారు. మౌలానా ఆజాద్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అబ్దుల్‌ రషీద్‌షేక్‌, డాక్టర్‌ ఖుద్ధుస్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయి సంస్థలతో సంబంధాల ద్వారా శిక్షణ, నిధి, మార్గదర్శక సహకారాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, సిబ్బంది పాల్గొన్నారు.

యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు

యాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు జరిగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం జరిపారు.

Advertisement
 
Advertisement
Advertisement